Pawan Kalyan: పవన్ ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారు

ABN , First Publish Date - 2023-06-02T18:04:05+05:30 IST

జనసేన అధినేత పవన్కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ రెండో వారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.

Pawan Kalyan: పవన్ ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారు

అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ రెండో వారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి (East Godavari West Godavari) జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసే సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ఈనెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. అన్నవరం దర్శనం తర్వాత పత్తిపాడు నుంచి యాత్ర మొదలవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కల్పించేలా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. స్థానికుల నుంచి సమస్యలపై పవన్ అర్జీలు తీసుకుంటారని, సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఆయన పర్యటిస్తారని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారని ప్రకటించారు. సినిమాల పరంగా ఇచ్చిన కమిట్‌మెంట్లు పూర్తి అయితే.. ప్రజల్లోనే పవన్ ఉంటారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

వారాహి ప్రత్యేకతలు...

పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా... చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు. ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్‌ మెట్లు ఉంటాయి. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-02T18:04:05+05:30 IST