Share News

Pawan Kalyan: జగన్ అరాచక పాలన వల్ల కలిగిన నష్టం ఎంతో ఉంది.. పవన్ కళ్యాణ్ ధ్వజం

ABN , Publish Date - Dec 14 , 2023 | 06:50 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల ఎంతో నష్టం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో..

Pawan Kalyan: జగన్ అరాచక పాలన వల్ల కలిగిన నష్టం ఎంతో ఉంది.. పవన్ కళ్యాణ్ ధ్వజం

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల ఎంతో నష్టం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో గనులు తవ్వుకెళుతున్నారే తప్ప.. ప్రజలకు మంచి చేయడం లేదన్నారు. చిన్నప్పుడు ప్లోరోసిస్ కారణంగా తాము కనిగిరి నుంచి వెళ్లిపోయామని.. ఆ సమస్య ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పొత్తులో మనం ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కూడా వైసీపి విముక్త ప్రాంతంగా మారాలన్నారు. రూ.150 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్న ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో ఉన్నారని.. కానీ ప్రజలు మాత్రం పొట్ట చేత పట్టుకుని వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్ర రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతోందని.. మహిళాభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తును నమ్మి గెలిపించాలని కోరారు. ఉద్దానం తరహాలో ప్రకాశం జిల్లాలో ఫ్లోరెసిస్, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పొత్తు దశాబ్ద కాలం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటే.. కనీసం దశాబ్ద కాలం పడుతుందన్నారు. సినిమా టిక్కెట్ల కోసం ఛీఫ్ సెక్రటరీలు, రెవిన్యూ యంత్రాగాన్ని వాడే విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. వాళ్లందరూ ప్రజల కోసం పని చేసి, మేలు చేసే మంచి పాలనని అందిస్తామని చెప్పారు. దశాబ్ద కాలంగా అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని జనసేన ఇక్కడిదాకా వచ్చిందన్నారు. వైసీపీ వంటి గూండా నాయకులను ఎదుర్కొన్నామంటే.. యువత, మహిళలే తమకు బలమని ఉద్ఘాటించారు.


మైనారిటీ అనే పదం తనకు ఇబ్బందిగా ఉంటుంది.. మైనారిటీ పేరుతో దూరం పెట్టడం కరెక్టు కాదనేది తన భావన అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మతాల మీద తనకు చాలా గౌరవం ఉందన్నారు. తాను బీజేపీతో ఉన్నందున రాలేకపోతున్నామని తన అభిమానులు కూడా చెబుతున్నారని.. మీకు అన్యాయం జరిగితే మానవత్వంతో మీకు అండగా నిలబడతానని మాటిచ్చారు. కౌలు రైతులకు సహాయం చేసేటప్పుడు తాను వివక్ష చూపలేదన్నారు. మతం అనేది మన దేవుడిని ప్రార్ధించడం కోసమని, సామరస్యంగా ఉండటం కోసమని వివరించారు. మనమంతా భారత రాజ్యాంగాన్ని ప్రేమించాలి, గౌరవించాలని కోరారు. తాను మత వివక్ష చూపనని మాటిచ్చారు. మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఎదగాలాంటే.. అన్ని మతాల వారు మన దగ్గరికి రావాలన్నారు. కులాలు, మతాలు దాటుకుని తాను మానవత్వాన్ని నమ్ముతానని అన్నారు.

ఈ ఒక్కసారి జనసేనని నమ్మండని, తప్పకుండా అందరికీ మంచే జరుగుతుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ముస్లీంలను మైనారిటీ ఓటు బ్యాంకుగా చూసే వ్యక్తిని తాను కాదని.. మీమీ ప్రాంతాల్లో అభివృద్ది, విద్య, ఉపాధి అవకాశాలు వచ్చేలా పాలసీలు రూపొందిస్తామని వాగ్ధానం చేశారు. ఈ ఒక్క ఎన్నికల్లో జనసేనకు ఓటు వేసి చూడాలన్నారు. గతంలో వైసీపీకి అవకాశం ఇచ్చి చూశారని.. ఈసారి తనకు ఛాన్స్ ఇస్తే ఇచ్చిన మాట మీద నిలబడి చూపుతానని బల్లగుద్ది చెప్పారు. ముస్లీంల రక్షణ, అభివృద్ది అనేది చాలా కీలకమన్నారు. పెద్ద మనసుతో అందరూ అర్దం చేసుకుని తనకు అండగా నిలవాలని కోరారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక్కరితో మాత్రమే కలవగలమన్నారు. రాష్ట్రం కోసమే తాను బీజేపీ పక్షం వహించానన్నారు. రాష్ట్రంలో ఉన్న ముస్లీం సమాజానికి నష్టం జరిగేతే.. గళమెత్తే మొదటి వ్యక్తిని తానేనన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 06:50 PM