TDP VS YCP: నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేత ఇంటిపై వైసీపీ దాడి.. ఎమ్మెల్యే అరెస్ట్‌కు డిమాండ్

ABN , First Publish Date - 2023-07-16T21:54:35+05:30 IST

నరసరావుపేటలో (Narasa Raopet) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌పై (Narasaraopet TDP in-charge Chadalawada Arvind) వైసీపీ దాడికి యత్నించింది.

TDP VS YCP: నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేత ఇంటిపై వైసీపీ దాడి.. ఎమ్మెల్యే అరెస్ట్‌కు డిమాండ్

పల్నాడు జిల్లా: నరసరావుపేటలో (Narasa Raopet) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌పై (Narasaraopet TDP in-charge Chadalawada Arvind) వైసీపీ దాడికి యత్నించింది. ఈ దాడిలో అరవింద్ బాబు కారు ధ్వంసం కాగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ వర్గీయులు దాడి చేసి కిటికీలు, ఫర్నిచర్‌ను పగలగొట్టారు. నిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిపై (MLA Gopireddy Srinivasa Reddy) విలేకరుల సమావేశంలో చల్లా సుబ్బారావు పలు అవినీతి ఆరోపణలు చేశారు. కోటప్పకొండ రోడ్డులో ఒక ఇంటిని సుబ్బారావు ఆక్రమించాడని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. టీడీపీ - వైసీపీ వర్గీయులు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. అరవింద్ బాబు డ్రైవర్‌పై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనతో సుబ్బారావు ఇంటికి టీడీపీ కార్యకర్తలు, ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు చేరుకున్నారు.


ప్రస్తుతం నరసరావుపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కోటప్పకొండ రోడ్డులో భారీగా పోలీసులు మొహరించారు. టీడీపీ నేతలపై దాడిని జిల్లా అధ్యక్షుడు జి.వి. ఆంజనేయలు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో జి.వి. ఆంజనేయులు ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలు ప్రశ్నస్తే దాడులు చేయడం దుర్మార్గమని, ఎమ్మెల్యే దగ్గరుండి టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిని ద్వంసం చేయించాడని ఆయన మండిపడ్డారు. పోలీసులు ఎమ్మెల్యే బంట్రోతులుగా మారారని విమర్శించారు. వైసీపీ అల్లరి మూకలను పోలీసులు ప్రోత్సాహిస్తున్నట్లు ఉందని, దాడికి పాల్పడిన వైసీపీ అల్లరి మూకలతో పాటు ఎమ్మెల్యేను సైతం అరెస్టు చేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. పరిస్థితిని కంట్రోల్ చేయకపోతే టీడీపీ నేతలు అంతా నరసరావుపేట వస్తారని హెచ్చరించారు.

Updated Date - 2023-07-16T22:06:54+05:30 IST