Somireddy: నెల్లూరు జిల్లాలో సిలికా దోపిడీ..

ABN , First Publish Date - 2023-04-04T15:57:13+05:30 IST

నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ కనుసన్నల్లో బరితెగించి మరీ సిలికా దోపిడీ (Silica Extortion) జరుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు.

Somireddy: నెల్లూరు జిల్లాలో సిలికా దోపిడీ..

నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ కనుసన్నల్లో బరితెగించి మరీ సిలికా దోపిడీ (Silica Extortion) జరుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చిల్లకూరు, కోట మండలాల్లో లభించే అరుదైన సిలికా శాండ్ మైనింగ్‌ (Silica Sand Mining)లో మూడేళ్లలో రూ.3 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. సముద్రతీర ప్రాంతంలో సాగరమాల ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన రోడ్డుని కూడా తవ్వేశారన్నారు. 2.50 మీటర్ల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఉంటే, 5, 6 మీటర్ల లోతు తవ్వుతున్నారని విమర్శించారు.

కర్నూలు జిల్లాలో అనుమతులు తీసుకొని, నెల్లూరులో మెటీరియల్ కాజేస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. 78 మంది లీజుదారుల మెడపై కత్తిపెట్టి మరీ, ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతూ, టన్ను రూ.1485కు అమ్ముకుంటున్నారని, జీఎస్టీ మాత్రం రూ.700 కడుతున్నారని అన్నారు. తనదారికి తెచ్చుకోవడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తన.. మన అనే తేడా లేకుండా మైనింగ్ దారుల్లోని వైసీపీ వారిపై కూడా రూ.300 కోట్ల వరకు పెనాల్టీలు వేశారన్నారు.

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్న సిలికా దోపిడీపై తక్షణమే కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) జోక్యం చేసుకోవాలని సోమిరెడ్డి కోరారు. ఈ దోపిడీపై సీబీఐ (CBI)తో విచారణ జరిపించి పెద్ద తలకాయలు ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సిలికా మైనింగ్ సీబీఐ, ఈడీ ED), ఫెమా (FEMA), ఎన్జీటీ (NGT) విభాగాలు అన్నీ దృష్టిపెట్టాల్సిన దోపిడీ వ్యవహారమని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-04T15:57:13+05:30 IST