Share News

Nandamuri Balakrishna: తమ్ముడు పవన్ కళ్యాణ్, ఇక తెగిద్దాం.. బాలకృష్ణ పిలుపు

ABN , Publish Date - Dec 20 , 2023 | 07:42 PM

విజయనగరంలో నిర్వహించిన నవశకం బహిరంగసభలో భాగంగా.. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌కు ఓ పిలుపు ఇచ్చారు. ‘‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’’ అంటూ

Nandamuri Balakrishna: తమ్ముడు పవన్ కళ్యాణ్, ఇక తెగిద్దాం.. బాలకృష్ణ పిలుపు

Nandamuri Balakrishna Interesting Comments On Pawan Kalyan: విజయనగరంలో నిర్వహించిన నవశకం బహిరంగసభలో భాగంగా.. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌కు ఓ పిలుపు ఇచ్చారు. ‘‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’’ అంటూ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోటీ చేద్దామని కోరారు. తనకు, పవన్ కళ్యాణ్‌కు కొన్ని సారూప్యతలు ఉన్నాయని.. తామిద్దరం ముక్కుసూటి మనుషులమేనని అన్నారు. ఏదేమైనా కుండబద్దలయ్యేటట్టు మాట్లాడే స్వభావం తామిద్దరిది అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాలకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారన్నారు. ఇకపై తాము ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారు.

బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని కొనియాడారు. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని కుండబద్దలయ్యేలా చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర యువత తమకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని.. అదే విధంగా నేడు యువగళం పాదయాత్రకు గొప్ప స్పందన లభించిందని అన్నారు. యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు.. వాళ్లందరికీ ధన్యవాదాలని తెలిపారు. చంద్రబాబు తన విజన్‌తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారని.. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి, పేదలకు అండగా నిలిచారని చెప్పారు. ప్రపంచదేశాలకు చంద్రబాబు తన విజన్‌ను పరిచయం చేశారన్నారు.


జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశారని బాలకృష్ణ ఆరోపించారు. జగన్ రాష్ట్రాభివృద్ధిని నిర్వీర్యం చేసి, రూ.10లక్షల కోట్ల అప్పు చేశాడన్నారు. అరాచకపాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్నంటాయని.. సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. జగన్ ల్యాండ్, శాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడని.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నాడు. ఏపీకి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడని.. అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడని.. పోలీసులు, ఉద్యోగులు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో పెడితే.. జగన్ నిర్లక్ష్యంతో నేడు దానిలో పందులు, కుక్కలు తిరిగేలా పాడుబెట్టాడని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఒక్క గుంత పూడ్చలేదు, ఒక్క రోడ్డు వేయలేదని చెప్పారు. సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడని తూర్పారపట్టారు.

తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని జగన్ చెప్తే.. అక్కడి ప్రజలు రాష్ట్ర సరిహద్దు వద్దే అడ్డుకుంటారని బాలకృష్ణ హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా.. వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. సొంత సామాజికవర్గాన్ని స్థానాల నుండి మార్చకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాల్లోకి జగన్ పంపుతున్నాడని.. ఇక సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్ చూపించేది కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ అని.. దయచేసి ఎవరూ నమ్మొద్దని బాలయ్య కోరారు. బావి మాత్రమే తన ప్రపంచమని కప్ప భావించినట్లు.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లోకం అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అణిచివేతలపై ఫ్రెంచి విప్లవం వచ్చిన విధంగా రాష్ట్ర ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. రానున్న ఎన్నికల్లో సుపరిపాలనకు స్వాగతం పలకాలన్నారు. ఎవడు అడ్డొస్తాడో మేం చూస్తామని.. మీరు ముందడుగు వేయండని బాలయ్య చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 20 , 2023 | 07:42 PM