Weather report: ఏపీలో విస్తరించిన రుతుపవనాలు.. అంతంతమాత్రంగానే వర్షాలు

ABN , First Publish Date - 2023-06-12T20:07:51+05:30 IST

రాయలసీమలోని పుట్టపర్తి వరకు సోమవారం నైరుతి రుతుపవనాల విస్తరించాయి. తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, కొంకణ్‌, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, బిహార్‌లలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Weather report: ఏపీలో విస్తరించిన రుతుపవనాలు.. అంతంతమాత్రంగానే వర్షాలు

విశాఖపట్నం: రాయలసీమ (Rayalaseema)లోని పుట్టపర్తి వరకు సోమవారం నైరుతి రుతుపవనాల విస్తరించాయి. తమిళనాడు (Tamil Nadu)లో మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, కొంకణ్‌, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, బిహార్‌లలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో దక్షిణ కోస్తాలోని శ్రీహరికోట (Sriharikota) వరకూ ఆదివారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అయితే రుతుపవనాలు ప్రవేశించిన ప్రాంతాల్లో స్వల్పంగా తప్ప విస్తారంగా వర్షాలు కురవడం లేదు. కొద్ది ప్రాంతాలను రుతుపవనాలు తాకినా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వడగాడ్పులు కొనసాగుతున్నాయి.

సోమవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 184 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 44.8 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, వీరఘట్టంలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 43 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 266 మండలాల్లో వడగాడ్పులు, బుధవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 294 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు, తరువాత మూడు రోజులు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

15న తీరం దాటనున్న అసాధారణ తుఫాన్‌

తూర్పుమధ్య అరేబియా సముద్రంలో గల అసాధారణ తుఫాన్‌ ‘బిపర్జాయ్‌’ వాయువ్యంగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్‌లోని పోరుబందర్‌కు 310 కిలోమీటర్లు నైరుతిగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఈనెల 14వ తేదీ వరకు ఉత్తరంగా, తరువాత ఉత్తర ఈశాన్యంగా పయనించి అతి తీవ్రతుఫాన్‌గా బలహీనపడి 15వ తేదీ ఉదయం సౌరాష్ట్ర-కచ్‌, పాకిస్థాన్‌ మధ్య తీరం దాటనున్నది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135, అప్పుడప్పుడు 150 కి.మీ. వేగంగా బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గుజరాత్‌ తీర ప్రాంతంలో పెనుగాలులు వీస్తాయని, భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Updated Date - 2023-06-12T20:07:51+05:30 IST