Varla Ramaiah: దున్నపోతు ఈనదని చెప్పలేని దుస్థితిలో ఏపీ పోలీస్ వ్యవస్థ..

ABN , First Publish Date - 2023-02-07T16:02:11+05:30 IST

అమరావతి: ఏపీ పోలీస్ (AP Police) వ్యవస్థపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్రస్థాయిలో విమర్శించారు.

Varla Ramaiah: దున్నపోతు ఈనదని చెప్పలేని దుస్థితిలో ఏపీ పోలీస్ వ్యవస్థ..

అమరావతి: ఏపీ పోలీస్ (AP Police) వ్యవస్థపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి (Jagan Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటినుంచీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతోందన్నారు. అధికారపార్టీ నేతలు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేయడానికి పోలీస్ వ్యవస్థ పరుగులు తీస్తోందని, దున్నపోతు ఈనదని చెప్పలేని దుస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉండటం సిగ్గుచేటన్నారు.

మచిలీపట్నం (Machilipatnam), గుడివాడ (Gudivada) డీఎస్పీ (DSP)ల తీరును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) సమర్థిస్తారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఏదిచట్టం.. ఏది న్యాయం.. ఏది నిజం.. ఏది అబద్ధం.. అని పోలీసులు ఆలోచించరా?.. అధికారపార్టీ నేతలు ఏదిచెబితే దానికి జీహుజూర్ అంటూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లురవీంద్ర (Kollu Ravindra) అరెస్ట్ చట్టవిరుద్ధమని, స్థానిక మేజిస్ట్రేట్ అతని రిమాండ్‌ను తిరస్కరించడం మచిలీపట్నం డీఎస్పీకి చెంపపెట్టు కాదా? అని అన్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని (Perni Nani) చెప్పాడని, స్థానిక డీఎస్పీ దేవాదాయభూమి విషయంలో చట్టవిరుద్ధంగా, ముఖ్యమంత్రి ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ దుయ్యబట్టారు. ఎవరో తాగుబోతు ఎమ్మెల్యే చెప్పాడని గుడివాడ డీఎస్పీ.. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేసి ఏ చట్టప్రకారం రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారని నిలదీశారు.

గుడివాడ, మచిలీపట్నం డీఎస్పీల ప్రవర్తన డీజీపీకి కనిపించడంలేదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. సదరు డీఎస్పీలు చేసింది రైటేనని చెప్పే ధైర్యం డీజీపీకి ఉందా? అన్నారు. గుడివాడ డీఎస్పీ, మచిలీపట్నం డీఎస్పీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గుడివాడ, మచిలీపట్నం డీఎస్పీలు ప్రజాస్యామ్య, రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును గర్హిస్తున్నామన్నారు. ఇద్దరు డీఎస్పీలపై తప్పకుండా ప్రైవేట్ కేసులు వేస్తామని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు ఎందుకు అంతలా నిరాశా నిస్పృహలతో ముఖ్యమంత్రిని దుర్భాషలాడారో డీజీపీ ఎప్పుడైనా ఆలోచించారా? అన్నారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ప్రస్టేషన్ ఒక్క తన్నీరు వెంకటేశ్వరరావుకు మాత్రమేలేదని.. పోలీశ్ శాఖ మొత్తానికి ఉందని డీజీపీ గ్రహించాలన్నారు. ఇప్పటికైనా కిందిస్థాయి పోలీసుల సమస్యలు, ఇబ్బందుల పరిష్కారానికి డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి రావాల్సిన సరెండర్, అడిషనల్ సెలవులు, రాయితీల వంటి సమస్యలు పరిష్కరించి, వారి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి, కాపాడాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-07T16:02:44+05:30 IST