Atchannaidu: ఆపరేషన్ విజయవంతం.. రోగి మృతి అన్నట్లుగా ఏపీ బడ్జెట్

ABN , First Publish Date - 2023-03-16T12:43:43+05:30 IST

ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రూ.2.79లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: ఆపరేషన్ విజయవంతం.. రోగి మృతి అన్నట్లుగా ఏపీ బడ్జెట్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రూ.2.79లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో వాస్తవాలు లేవని అడిగితే తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్ కూడా మోసపూరితమే అని అన్నారు. ఘనంగా కేటాయింపులు చూపుతూ ఖర్చు మాత్రం భూతద్దంలో వెతికినా కనిపంచని విధంగా ఉన్న గత బడ్జెట్‌ల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. శస్త్ర చికిత్స విజయవంతం... రోగి మృతి అన్నట్లుగా బడ్జెట్‌ను రూపొందించారని యెద్దేవా చేశారు. కమిషన్ల కోసమే సాగునీటి రంగానికి రూ.22 వేల కోట్ల కేటాయింపులు చూపారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసుకున్నవే అని తెలిపారు. 6 లక్షలపై చిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు సిగ్గులేకుండా అసత్యాలు చెప్పారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోరంట్ల మాట్లాడుతూ.. ఆర్ధిక క్రమశిక్షణ లేని బడ్జెట్‌ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ పాలన మోనార్కిజంలా సాగుతోందని విమర్శించారు. ఆదాయం ఎంతో ఖర్చు ఎంతో చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. అప్పులు పట్టించుకోవటం కోసం ప్రజల్ని మోసగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో అవి నిర్వీర్యమైపోతున్నాయని తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోసం నడిచే ఆసుపత్రికే నిధులు లేక మందులు ఇవ్వట్లేదంటే, ఇక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఏంటి అని గోరంట్ల ప్రశ్నించారు.

నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. బుగ్గన ఆర్థిక శాఖా మంత్రిగా కంటే అప్పుల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేసిన 9 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో చూపిన కేటాయింపులకు తగ్గట్టు ఖర్చులు లేకనే రైతులు పంటల విరామం ప్రకటిస్తున్నారన్నారు. మూడు రాజధానులకు మూడు ఇటుకలు కూడా పెట్టకుండా అమరావతిని అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-16T12:43:43+05:30 IST