Ramakrishna: జగన్ చేతకానితనంతో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు..

ABN , First Publish Date - 2023-03-26T16:04:25+05:30 IST

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చేతకానితనంతో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) తీవ్రస్థాయిలో విమర్శించారు.

Ramakrishna: జగన్ చేతకానితనంతో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు..

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చేతకానితనంతో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, సీఎం ఆ ప్రాంతాలలో పర్యటనలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) విషయంలో ప్రధాని మోదీ (PM Modi) అన్యాయం చేసినా.. జగన్ నోరు మెదపడంలేదని మండిపడ్డారు.

‘‘వైయస్ రాజేశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) పోలవరం ప్రారంభించినప్పుడు 150 అడుగులతో నిర్మిస్తామన్నారు.. మా నాన్న ప్రారంభించారని, నేను పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారు.. ఇప్పుడు 135 అడుగులకు కుదిస్తే.. జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు..’’అని రామకృష్ణ ప్రశ్నించారు. సీఎం చేతకాని, పిరికి తనం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని.. రాష్ట్ర చరిత్రలో జగన్ ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. ప్రధాని మోదీ, జగన్ ఇద్దరూ లాలూచీ వైఖరితో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల 27, 28 తేదీలలో దీక్షలు చేపడుతున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. 28న విశాఖ, అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నామన్నారు. ప్రపంచం మొత్తం అదానీ గురించి మాట్లాడుతుంటే.. జగన్ మాత్రం కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. జగన్, అదానీలు ఇటీవల నాలుగు గంటల పాటు మాట్లాడారని.. ఆ విషయాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వెడ్డింగ్ కార్డు ఇచ్చే పేరుతో నాలుగు గంటలు ఏం చర్చలు సాగాయని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలు ఏమిటో చెప్పాలన్నారు. సీఎం ఆర్దిక ప్రయోజనాలు అన్నీ అదానీతో ముడిపడి ఉన్నాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని.. దేశంలో మోదీతో జత కట్టి వెళతాం అనేది జగన్ సిద్దాంతమని రామకృష్ణ విమర్శించారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయండి అంటున్న జగన్‌కు ఓటమి భయమా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు కొని గెలిచారని.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్‌కు తగిన బుద్ది చెప్పారన్నారు. దేశంలో మోదీ, ఎపీలో జగన్‌ను ఓడించడమే తమ లక్ష్యమని రామకృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-26T16:04:25+05:30 IST