Vijayawada: కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట ఘటనపై నేడు విచారణ

ABN , First Publish Date - 2023-02-07T10:48:05+05:30 IST

చంద్రబాబు (Chandrababu) రోడ్ షో (Road Show) సభల సందర్భంగా కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంగళవారం విజయవాడలో విచారణ జరగనుంది.

Vijayawada: కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట ఘటనపై నేడు విచారణ

విజయవాడ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) రోడ్ షో (Road Show) సభల సందర్భంగా కందుకూరు (Kandukuru), గుంటూరు (Guntur)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంగళవారం విజయవాడలో విచారణ జరగనుంది. కందుకూరు ఘటనపై ఉదయం 11 గంటలకు టీడీపీ నేతలు కాకర్ల మల్లికార్జున్, ఇంటూరి రాజేష్‌.. గుంటూరు ఘటనపై సాయంత్రం 3 గంటలకు తెనాలి శ్రావణ్ కుమార్, శేష శాయినా రెడ్డి కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాగా నిన్న గుంటూరు ఘటనపై ఉయ్యూరు శ్రీనివాసరావుని శేష శాయినా రెడ్డి కమిషన్ విచారించింది. విచారణ అనంతరం నివేదికను జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ ప్రభుత్వానికి అందజేయనుంది.

నెల్లూరు జిల్లా, కందుకూరులో తెలుగు దేశం పార్టీ (TDP) నిర్వహించిన ‘ఇదేం ఖర్మ’ సభలో తొక్కిసలాట కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టగానే జనాలు ముందుకు రావడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కింద పడిపోయారు. కొందరు పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయారు. వారిని పైకి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే శ్వాస ఆడకపోవడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం మరో ఆరుగురు మరణించారు.

గుంటూరు, ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత సభా ప్రాంగణం వెలుపల లారీల్లో ఉంచిన కానుకలను పంచుతుండగా.. ఒకేసారి అందరూ ఎగబడ్డారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి.. గుంటూరు ఏటీ అగ్రహారం నాలుగో లైనులో పోలేరమ్మ గుడి సమీపంలో ఉండే గోపిదేశి రమాదేవి(50) అక్కడికక్కడే మృతి చెందింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నగరంపాలెం గొర్రెలదొడ్డికి చెందిన సయ్యద్‌ అతీఫా(45), మారుతీనగర్‌ మూడో లైనుకు చెందిన షేక్‌ బీబీజాన్‌ (50) మరణించారు. ఈ విషాదం చోటు చేసుకోవడానికి నిర్వాహకుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది.

Updated Date - 2023-02-07T10:48:09+05:30 IST