Share News

CM Jagan: 3వ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న సీఎం జగన్

ABN , Publish Date - Dec 20 , 2023 | 09:13 AM

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కార్యక్రమాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

CM Jagan: 3వ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న సీఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కార్యక్రమాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలు వారీగా ఆడుదాం ఆంధ్ర సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు మరి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సీఎం జగన్ మాట్లాడనున్నారు. వరుసగా మూడవ రోజు కూడా ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు.

ఇన్చార్జుల మార్పులు, చేర్పులు సీటు కొనసాగింపు లేదా మార్పుపై సీఎం, పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. కాగా సీటు లేదని చెబితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారేమోనన్న ఆందోళనలో అధిష్టానం ఉంది. ఏదో విధంగా ఎమ్మెల్యేలను ఒప్పించి పార్టీ నిర్ణయాన్ని శిరసావహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా 80 మంది వరకు ఎమ్మెల్యేల సీట్లలో మార్పులు, స్థానచలనం ఉంటుందని ఇప్పటికే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిన విషయం తెలిసిందే.

కాగా ఎమ్మెల్యేల అసంతృప్తి జగన్‌ అహంభావపు పునాదులను కదిలిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌ గేటు వద్దకు కాదుకదా... ఆ రోడ్డు వైపు కూడా తిరగని ఎమ్మెల్యేల కార్లకు ఇప్పుడు నేరుగా ‘కోట’ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. టికెట్ల గల్లంతు, మార్పులు, తకరార్లపై ఎమ్మెల్యేలు భగ్గుమంటున్న నేపథ్యంలో... వైసీపీ అధిష్ఠానం భారీస్థాయిలో ‘సర్దుబాటు’ చర్యలు ప్రారంభించింది. 150 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 80 మందికి ఈసారి మొండిచేయి చూపిస్తారని, కొంత మంది ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు, ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అగ్ని రాజుకుంది. బెంగళూరులో ఎంపీ మిథున్‌ రెడ్డి 42 మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ జరపడం, వారి ఆగ్రహావేశాలను జగన్‌కు చెప్పడం... పరిస్థితి చేయి దాటుతున్న నేపథ్యంలో జగన్‌ నేరుగా ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని నిర్ణయించుకోవడం... ఈ పరిణామాలపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. మంగళవారం కూడా ఎమ్మెల్యేలతో తాడేపల్లి ప్యాలెస్‌లో చర్చలు జరిగాయి. జగన్‌ అన్ని పనులు మానుకొని రోజుకు కొందరు చొప్పున అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. సోమవారం నాడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో మాట్లాడిన జగన్‌ మంగళవారం కూడా భేటీలు కొనసాగించారు.

Updated Date - Dec 20 , 2023 | 09:13 AM