AP News: రాజధాని అమరావతిలో మరో రోడ్డు మాయం

ABN , First Publish Date - 2023-02-07T11:36:01+05:30 IST

ఏపీ రాజధాని అమరావతి (Amaravathi)లో మరో రోడ్డు మాయమైంది. లింగరాయపాలెం సమీపంలో సీఆర్డీయే కార్యాలయం భవనం ముందున్న రోడ్డును దుండగులు తవ్వుకు వెళ్లారు.

AP News: రాజధాని అమరావతిలో మరో రోడ్డు మాయం

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి (Amaravathi)లో మరో రోడ్డు మాయమైంది. లింగరాయపాలెం సమీపంలో సీఆర్డీయే (CRDA) కార్యాలయం భవనం ముందున్న రోడ్డును దుండగులు తవ్వుకు వెళ్లారు. రాజధాని అమరావతిలోని రోడ్లను దుండగులు మాయం చేస్తున్నారు. ఇప్పుడు మెటల్‌ను లారీలతో తరలించుకుపోతున్నా.. సీఆర్డీయే అధికారులు, పోలీసులు పట్టించుకోవడంలేదు. రోడ్డు నిర్మాణం కోసం వేసిన రోడ్‌పై పరచిన మెటల్‌ను రాత్రికి రాత్రే దుండగులు దొంగిలించుకుపోయారు. రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు దొంగతనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు.

ఏపీలో మట్టి అక్రమాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలు, జూదాలకు పాల్పడే గడ్డం గ్యాంగ్‌ కూడా మట్టి అక్రమాల్లోకి జొరబడింది. ఆక్రమణలకు తెగబడుతోంది. నిన్నటి వరకూ చేపల చెరువు మట్టి అక్రమంగా తవ్వుకొని అమ్మి సొమ్ము చేసుకోగా.. నేడు బుడమేరు గట్టును గడ్డం గ్యాంగ్‌ అడ్డదిడ్డంగా తొలిచేస్తోంది. దర్జాగా ఇటు గుడివాడ అటు అరిపిరాల రోడ్డు వద్దకు స్థలాల మెరకకు మట్టి తరలిస్తూ కాసులు పిండుకుంటోంది. అధికారులు ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. నందివాడ మండలం శంకరంపాడులోనూ చెరువు మట్టిని కొందరు అక్రమంగా తరలించేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

నందివాడ మండలం పుట్టగుంట అక్రమ చేపల చెరువులో గడ్డం గ్యాంగ్‌ మట్టి తవ్వకాలు చేపట్టిన విషయం విదితమే. ఏకంగా బుడమేరు వరద కట్టను కూడా తొలుస్తున్నారు. కరకట్టను ఒలిచేస్తున్నా డ్రైనేజీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సుమారు 20 అడుగుల లోతు మేర కరకట్టను ఒలిచేయడంతో కరకట్ట బలహీనంగా మారింది. భారీస్థాయిలో బుడమేరుకు వరద వస్తే నందివాడ మండల ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది.

పగలు, రాత్రి తేడాలేకుండా గడ్డం గ్యాంగ్‌ యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదు. మట్టిని బహిరంగంగానే ఇటు గుడివాడకు అటు అరిపిరాల రోడ్డు వద్ద గల స్థలాల మెరకుకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా మట్టిని తరలిస్తున్నా మైనింగ్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.

Updated Date - 2023-02-07T11:36:04+05:30 IST