Varahi Yatra: ఈ పోరాటంలో నేను బతికుంటానో లేదో తెలియదు

ABN , First Publish Date - 2023-06-26T20:20:14+05:30 IST

వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేనాని పవన్‌కళ్యాణ్ సోమవారం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రక్షాళన, పరివర్తన కోసమే తన పోరాటమని, ఈ పోరాటంలో నేను బతికుంటానో లేదో తెలియదని పవన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. పాలకులు ప్రజల చెమట, రక్తాన్ని పీల్చేస్తున్నారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

Varahi Yatra: ఈ పోరాటంలో నేను బతికుంటానో లేదో తెలియదు

నరసాపురం: వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేనాని పవన్‌కళ్యాణ్ సోమవారం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రక్షాళన, పరివర్తన కోసమే తన పోరాటమని, ఈ పోరాటంలో నేను బతికుంటానో లేదో తెలియదని పవన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. పాలకులు ప్రజల చెమట, రక్తాన్ని పీల్చేస్తున్నారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. ‘‘ సీఎం జగన్‌కి చెబుతున్నా.. రోజులు మారాయి. మాటలతో మోసం చేసే కాలం కాదు.. తిరగబడే కాలం’’ అని పవన్ హెచ్చరించారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించే రాజకీయ నేతలు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

చెప్పులు ఎత్తుకెళ్లినా భరిస్తా.. కానీ..

‘‘ నన్ను తిట్టినా.. ద్వేషించినా.. చెప్పులు ఎత్తుకెళ్లినా భరిస్తా. కానీ అవినీతి, రౌడీయిజం చేస్తామంటే మాత్రం భరించను’’ అని జగన్ సర్కార్‌కు పవన్ వార్నింగ్ ఇచ్చారు. తాను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు బాధపడ్డానని, అవినీతికి పాల్పడే వారు గెలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ ఆశయాలున్న తాను ఎందుకు ఓడిపోయా?, జగన్‌కి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయి? అని జనసేనాని ప్రశ్నించారు. జగన్‌ హైదరాబాద్‌లో కూర్చుని దందాలు చేసేవారని విమర్శల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే తల్లిదండ్రుల పెంపకం తప్పని మహిళా నేతలు అంటున్నారని పవన్ మండిపడ్డారు. ‘‘ వ్యవస్థ మన మాట విననప్పుడు విప్లవమే వస్తుంది. ఆయుధం అంటే కత్తులు కాదు, గొంతే ఆయుధం కావాలి. పులివెందుల సంస్కృతి ఇక్కడికి తీసుకొస్తే కుదరదు. నరసాపురం ప్రజలు బాంబులకు, కొడవళ్లకు భయపడరు. రౌడీ మూకలను తన్ని తరిమేస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జగన్‌ బటన్లు నొక్కి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. పూర్తికాని పోలవరం జగన్‌ నొక్కని బటన్‌ అని, జగన్‌ నొక్కని ఉద్యోగాల భర్తీ బటన్‌ అని, అభివృద్ధికి నోచుకోని ఏపీ తమరు నొక్కని బటన్‌ అని మండిపడ్డారు.

Updated Date - 2023-06-26T21:06:23+05:30 IST