Pawan Kalyan on Chandrababu Arrest: రాజకీయ కక్ష సాధింపు వల్లే చంద్రబాబు అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-09T12:06:00+05:30 IST

ప్రాథమిక ఆధారాలు లేకుండా అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారని.. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ అరెస్ట్ జరిగిందని పవన్ ఆరోపించారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan on Chandrababu Arrest: రాజకీయ కక్ష సాధింపు వల్లే చంద్రబాబు అరెస్ట్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీడియాకు వీడియోను విడుదల చేశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారని.. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ అరెస్ట్ జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏ తప్పు చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఎద్దేవా చేశారు. కనీసం తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు టీడీపీ నేతలకు కూడా బయటకు రానివ్వడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులు అని.. అసలు శాంతిభద్రతలకు, వైసీపీకి సంబంధం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంది వైసీపీ వల్లేనని అన్నారు.

అటు వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం తప్పా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. గతంలో విశాఖలోనూ తమతోనూ ఇదే విధంగా వ్యవహరించారని పవన్ గుర్తుచేశారు. వైసీపీ నేతలు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు.. జైళ్లలో మగ్గిపోవచ్చు.. విదేశాలకు వెళ్లవచ్చు అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని.. ఆయన త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-09T12:09:36+05:30 IST