Viveka Case: అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు.. వైసీపీలో ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-03-16T21:32:00+05:30 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ అరెస్ట్‌ చేయకుండా చూడాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) హైకోర్టు కెళ్లారు.

Viveka Case: అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు.. వైసీపీలో ఉత్కంఠ

హైదరాబాద్: వైఎస్‌ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ అరెస్ట్‌ చేయకుండా చూడాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) హైకోర్టు కెళ్లారు. అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై ఇరువాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాశ్‌రెడ్డి అభ్యర్థనపై రేపు (శుక్రవారం) న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ నెల 17న సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్‌ రెడ్డి... అంతకంటే ఒక్కరోజు ముందే హైకోర్టు మెట్లెక్కారు. ‘నన్ను అరెస్టు చేయకుండా చూడండి’ అని న్యాయస్థానాన్ని కోరారు. 16వ తేదీన తెలంగాణ హైకోర్టు (High Court)లో లంచ్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా తనను 161 సీఆర్పీసీ (CRPC) కింద అసలు విచారించకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌లో సీబీఐ (CBI)పై ఆయన అనేక ఆరోపణలు చేశారు. అంతేకాదు... వివేకా కుటుంబంలో చాలా వివాదాలున్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయనకు ముప్పు ఉండిందని తెలిపారు.

‘‘నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదు. జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండు దఫాలు సీబీఐ తనను విచారించింది. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోంది. నా స్టేట్‌మెంట్‌ను ఆడియో వీడియో రికార్డు చేయడంతోపాటు స్టేట్‌మెంట్‌ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయండి. విచారణకు నాతోపాటు న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశించండి’’ అని అవినాశ్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు.

తన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు సీఆర్పీసీ సెక్షన్‌ 161 కింద సీబీఐ తనను విచారించకుండా స్టే విధించాలని.. అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీచేయాలని కోరారు. అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. మొత్తం 35 సాక్షుల స్టేట్‌మెంట్లు, 10 డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు కోర్టుకు సమర్పించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్, ఎఫ్‌ఎస్ఎల్ నివేదిక‌ను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. 160 సీర్పీసీలో విచారించబడుతున్నారని... కోర్టు ద్వారా విచారణకు రాలేదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీసులతో వచ్చారని సీబీఐ తెలిపింది. ఇరువాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 17వ తేదీకి (రేపు) రిజర్వ్ చేసింది. దీంతో రేపు హైకోర్టు తీర్పుపై అవినాశ్‌రెడ్డితో పాటు వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-03-16T21:32:00+05:30 IST