Flexies: జగన్ రాకతో ఫ్లెక్సీల ఏర్పాటు... నవ్వుకుంటున్న జనాలు.. ఇంతకీ అందులో ఏముందంటే?

ABN , First Publish Date - 2023-07-24T09:25:44+05:30 IST

గుంటూరు జిల్లాలో కృష్ణయపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి జనాలు నవ్వుకుంటున్న పరిస్థితి.

Flexies: జగన్ రాకతో ఫ్లెక్సీల ఏర్పాటు... నవ్వుకుంటున్న జనాలు.. ఇంతకీ అందులో ఏముందంటే?

అమరావతి: గుంటూరు జిల్లా కృష్ణయపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి జనాలు నవ్వుకుంటున్న పరిస్థితి నెలకొంది. సీఎం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆచితూచి ఎలాంటి అక్షర దోషాలు లేకుండా వేయాల్సి ఉంటుంది. అయితే కృష్ణాయపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక్క అక్షర దోషం మొత్తం అర్ధాన్నే మార్చిసిన వైనం నెలకొంది.

అసలేం జరిగిందంటే.. కృష్ణాయపాలెంలో సీఎం జగన్ రాక సందర్భంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అక్షర దోషాలు అర్థాలను మార్చేశాయి. పేదలను పెద్దోళ్ళుగా చేయడం అనడానికి బదులు... ‘‘పేద్దోళ్లు’’గా అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే చారిత్రాత్మకంను ‘‘చార్రితాత్మకం’’ అంటూ ఫ్లెక్సీలో ముద్రించడంపై జనాలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న మార్గంలోని ముఖద్వారం వద్ద ఫ్లెక్సీలో అక్షర దోషాలు దొర్లాయి.

jagan-flexi.jpg

మరోవైపు ఈరోజు గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్‌‌లో పేదల ఇళ్ళ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు హెలీకాప్టర్‌లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్‌ లే అవుట్‌కు జగన్ చేరుకోనున్నారు. అక్కడ వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఇళ్ళ నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అక్కడే మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన అనంతరం హెలికాప్టర్‌లో వెంకటపాలెంకు చేరుకోనున్నారు. అక్కడ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారుకార్యక్రమం తర్వాత అక్కడి నుంచి తిరిగి హెలీకాప్టర్‌ లో మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

కాగా.. సీఎం కార్యక్రమానికి భారీగా విద్యాసంస్థల బస్సుల్లో జనాలను అధికారులు తరలించనున్నారు. విద్యార్ధులకు పరీక్షలు ఉన్నాయని బస్సులు ఇవ్వలేమని కళాశాలల యాజమాన్యాలు చెప్పినప్పటికీ బస్సులు ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువచ్చారు. స్కూళ్లు, కళాశాలల బస్సులు మొత్తాన్ని తీసుకొని జనాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు , విజయవాడ , పెదకాకాని, మంగళగిరి , తాడేపల్లి, దుగ్గిరాల నుంచి సీఎం సభకు జనాన్ని అధికారులు బస్సుల్లో తరలిస్తున్న పరిస్థితి.

Updated Date - 2023-07-24T10:48:08+05:30 IST