Share News

Venkaiahnaidu: అలాంటి వారిని ఎన్నిక్లలో ఓడించటమే సరైన మందు

ABN , First Publish Date - 2023-10-13T10:42:53+05:30 IST

ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు ఎంతో సేవ చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Venkaiahnaidu: అలాంటి వారిని ఎన్నిక్లలో ఓడించటమే సరైన మందు

గుంటూరు: ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు (Famous Doctor Dr. Kasaraneni Sadashiva Rao) ఎంతో సేవ చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President of India Muppavarapu Venkaiah Naidu) అన్నారు. కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరోపకారం కోసం జీవితాంతం కట్టుబడిన వ్యక్తి సదాశివరావు అని చెప్పుకొచ్చారు. కాసరనేని మరణానంతరం జీవించి ఉన్నారంటే వారు బతికి ఉన్నప్పుడు చేసిన పనులే కారణమన్నారు. ఇప్పటికి లక్షలాది మంది గుండెల్లో సదాశివరావు నిలిచిపోయారని.. అరుదైన రాజకీయ నాయకుల్లో కాసరనేని ఒకరు అని కొనియాడారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో పని చేసేవారు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుందని తెలిపారు.

విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పని చేస్తే దేశం శక్తివంతం అవుతుందన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయాల్లో విలువలు గల నాయకులు తగ్గారని అన్నారు. స్థాయికి తగ్గట్లుగా నాయకులు మాట్లాడటం లేదని, తప్పుడు భాష మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని ఎన్నిక్లలో ఓడించటమే సరైన మందు అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించుకోవాలని సూచించారు. చదువుకున్న వారు రాజకీయాల్లో రావాలని, సేవా భావం ఉన్నవారు వైద్య వృత్తిలో ఉండాలన్నారు. ఇప్పుడు కొందరు అనవసరంగా లేని పోని వైద్య పరీక్షలు రాసి రోగి జేబులు ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు. కాసరనేని సదాశివరావు పేద రోగుల వద్ద డబ్బులు తీసుకోకుండా వైద్యం అందించారని తెలిపారు. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విద్యా సంస్థలను స్థాపించారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


కాగా.. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పలు రంగాలలో ప్రముఖులకు సన్మానం జరిగింది. కాసరనేని శత జయంతి ప్రత్యేక సంచిక సదాస్మరామి పుస్తకం, ప్రత్యేక తపాలా బిల్లను వెంకయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు వడ్డే శోభానాదీశ్వరావు, కామినేని శ్రీనివాసరావు, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వల్లూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-13T10:42:53+05:30 IST