Chittoor Dist.: నగరిలో జగనన్న విద్యాదీవెన ప్రారంభించనున్న జగన్‌

ABN , First Publish Date - 2023-08-28T09:05:16+05:30 IST

చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు బటన్ నొక్కి విద్యాదీవెన, వసతిదీవెన విడుదల చేయనున్నారు.

Chittoor Dist.: నగరిలో జగనన్న విద్యాదీవెన ప్రారంభించనున్న జగన్‌

చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సోమవారం నగరి (Nagari)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు బటన్ నొక్కి విద్యాదీవెన, వసతిదీవెన విడుదల చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి వస్తున్నారని నగరి పట్టణాన్ని పోలీసులమయం చేశారు. బైపాస్‌ రోడ్డులోను.. పట్టణంలోకి సోమవారం ఉదయం నుంచే వాహనాలను అనుమతించడం లేదు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షల (Traffic Restrictions) వల్ల మధ్యాహ్నం వరకు ప్రయాణికులు నగరికి చేరుకోలేని పరిస్థితి తలెత్తింది. విద్యా దీవెన పథకం కింద మూడో విడత నిధుల జమకు బటన్‌ నొక్కేందుకు సీఎం నగరికి రానున్నారు.

ఈ ఒక్క సభ కోసం అధికారులు రెండు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కీళపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో సీఎం జగన్ దిగనున్నారు. అక్కడ్నుంచి బస్సులో బైపాస్‌ రోడ్డు నుంచి ప్రకాశం రోడ్డు మీదుగా నగరిలో ప్రయాణించి.. పట్టణానికి అటువైపు ఉన్న బైపాస్ రోడ్డు మీదుగా సభాస్థలికి సీఎం చేరుకుంటారు. సభ ముగిశాక అక్కడికి సమీపంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మరో హెలిప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమవుతారు. దీంతో ఉదయం నుంచి సీఎం పర్యటన ముగించుకుని బయలుదేరే వరకు (మధ్యాహ్నం మూడు గంటల వరకు) బైపాస్‌ రోడ్డులో వాహనాలను నిలిపేశారు. దీనివల్ల నగరి మీదుగా పుత్తూరుకు వాహనాలన్నీ ఆగిపోతాయి. అలాగే, సభా స్థలికి చేరుకునే వరకు నగరి పట్టణంలోకి కూడా వాహనాలకు అనుమతి లేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం వరకు దూరప్రాంతాల నుంచి వచ్చేవారు నగరిలోకి వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ సొంత వాహనాల్లో వచ్చిన శివార్లలో ఆపేసి ఐదారు కిలోమీటర్లు నడుచుకుని వెళ్లాల్సిందే. ఆర్టీసీ బస్సులైతే నగరిలోకి రాని పరిస్థితి. దీంతో నగరికి వచ్చేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందే. ద్విచక్ర వాహనాలనూ అనుమతించరు. సీఎం బస్సులో వెళ్లే బైపాస్‌ రోడ్డులో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.

జగన్‌ సీఎం అయ్యాక తొలిసారి నగరికి వస్తున్నారు. ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని జనం కోరుతున్నారు. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేయించి సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, నగరి నియోజకవర్గంలో అత్యధికంగా చేనేత కార్మికులున్నారు. వీళ్లకు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగడంతో అత్యధికులు మరమ్మగ్గాలను మూసివేశారు. తమిళనాడులో చేనేతలకు 500 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా కరెంటును ఇస్తోంది. ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరుతున్నారు. రెండేళ్ల కిందట చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసి ప్రస్తుత మంత్రి రోజా కోరారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక, కరెంటు కోతలతో మరమగ్గాలు మధ్యలోనే ఆగుతుండటంతో నూలు నాణ్యత లోపించే ప్రమాదం ఉంది.

రూ.36 కోట్ల చెరకు బిల్లులేవీ?

నాలుగేళ్లుగా చెరకు బిల్లులు అందక నగరి నియోజకవర్గంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వీటిని తీర్చేందుకు కొందరు రైతులు భూముల్ని కూడా అమ్ముకున్నారు. నిండ్ర మండలంలోని నేతమ్స్‌ షుగర్‌ ఫ్యాక్టరీకి 2018-19 క్రషింగ్‌ సీజన్‌లో చెరకును తరలించిన రైతులకు రూ.36 కోట్ల బిల్లులు రావాలి. బాధిత రైతులు కొత్త రైతు సంఘాన్ని ఏర్పాటుచేసుకుని పలుమార్లు సమావేశాలు, ధర్నాలు చేశారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అమలు చేసి రైతులకు బిల్లులు ఇప్పించాలని స్థానిక తహసీల్దార్‌కు ఇటీవల కలెక్టర్‌ సూచనలిచ్చారు. నోటీసులు అంటించారేగానీ ఇప్పటివరకు తగు చర్యలు తీసుకోలేదు.

కాలుష్య కోరల్లో పట్టణం

శుద్ధిచేసే ఈటీపీ ప్లాంటుకు తరలించాల్సిన రంగు నీళ్లను కొందరు మరమగ్గాల యజమానులు ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. దీంతో నగరి పట్టణం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కుశస్థలి నది, మాంగాడు చెరువు, మజ్జిగ కాలువ, ఏకాంబరకుప్పం చెరువులు రంగు నీళ్లతో నిండిపోయి.. కలుషితమయ్యాయి. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల నివశించేవారు కూడా విధిగా మినరల్‌ వాటర్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. ఆరు నెలల కిందట కరకంటాపురం యువత రంగు నీళ్ల బెడద నుంచి తప్పించమని చిత్తూరు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. అయినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.

Updated Date - 2023-08-28T09:05:16+05:30 IST