Chittoor: నారా లోకేష్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-02-04T11:12:02+05:30 IST

చిత్తూరు జిల్లా: బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ (Nara Lokesh) సహా ఆరుగురిపై కేసు నమోదైంది. లోకేష్తో పాటు అమర్నాథ్‍రెడ్డి, దీపక్ రెడ్డి, పులివర్తి నానిపై కేసునమోదైంది.

Chittoor: నారా లోకేష్‌పై కేసు నమోదు

చిత్తూరు జిల్లా: బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ (Nara Lokesh) సహా ఆరుగురిపై కేసు నమోదైంది. లోకేష్తో పాటు అమర్నాథ్‍రెడ్డి (Amarnath Reddy), దీపక్ రెడ్డి (Deepak Reddy), పులివర్తి నాని (Pulivarthi Nani)పై కేసునమోదైంది. టీడీపీ నేతలు ఎన్.పి.జయప్రకాశ్ (Jayaprakash), జగదీశ్‍ (Jagadish)పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర టీడీపీ నేతలపై పలమనేరు సీఐ అశోక్కుమార్ ఫిర్యాదు చేశారు.

బంగారుపాళ్యం ఘటనపై టీడీపీ సీరియస్ అయింది. కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కయి యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిన్న బంగారుపాళ్యం బహిరంగ సభలో పోలీసులు మూడు వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, హత్యయత్నానికి పాల్పడ్డారంటూ పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే మూడు వాహనాలు సీజ్ చేయడంతో ఇవాళ ప్రచారం ఎలా కొనసాగించాలన్న ఏర్పట్లలో టీడీపీ ఉంది.

ఈ సందర్బంగా టీడీపీ నేత దీపక్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రను అడ్డుకోమని వైసీపీ నేతలు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ మొన్న పుంగనూరులో జన ప్రభంజనం చూసిన తర్వాత పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభ జరుగుతుండగా ఏమీ మాట్లాడకుండా.. అంతా అయిపోయిన తర్వాత వాహనాన్ని సీజ్ చేస్తున్నామని డీఎస్సీ చెప్పారని, ఎందుకు సీజ్ చేస్తున్నారని ప్రశ్నించి.. నోటీస్ ఇవ్వాలని కోరామన్నారు. దీంతో డీఎస్సీ ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారన్నారు. నిన్న బంగారుపాళ్యం సభను అడ్డుకోవాలనే పక్కా ప్రణాళికతో డీఎస్పీ తన పోలీస్ బలగంతో వచ్చి.. ఇక్కడ మీటింగ్ పెట్టవద్దని లోకేష్‌తో

చెప్పారన్నారు. దీంతో లోకేష్ వాహనం ఎక్కకుండా పక్క ఉన్న భవనంపైకి ఎక్కి ప్రసంగించారన్నారు. అయినా మూడు వాహనాలను సీజ్ చేశారని దీపక్ రెడ్డి తెలిపారు. తమ ప్రచార వాహనంతోపాటు ప్రెస్ వెహికల్‌ను కూడా సీజ్ చేశారన్నారు. అక్కడితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారని, చాలా మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. పోలీసులపై తాము ఎక్కడ కేసు పెడతామోనని భయపడి.. తిరిగి తమపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నీచస్థాయికి పోలీసు అధికారులు దిగజారారన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు లోకేష్ వెంట నడుస్తారని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-04T11:12:06+05:30 IST