Temperature: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

ABN , First Publish Date - 2023-04-19T17:54:03+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగమంటున్నాడు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది.

Temperature: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగమంటున్నాడు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. ఖమ్మం జిల్లా (Khammam District)లో 43.44 డిగ్రీల ఉష్ణోగ్రత (Temperature) నమోదయింది. కడప జిల్లా (Kadapa District) కమలాపురంలో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉషోగ్రత నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని సుమారు 100 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా, బుధ, గురువారాల్లో వడగాడ్పులు కొనసాగుతాయని, తరువాత నాలుగు రోజులు తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వారం, పదిరోజుల నుంచి కొనసాగిన ఎండల ప్రభావానికి వాతావరణ అనిశ్చితి ఏర్పడి 21నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 24వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, తరువాత మళ్లీ ఎండ తీవ్రత పెరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత ఉందని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.

జాగ్రత్తలు తప్పని సరి

వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుంది. అలాగే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కనుక వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్‌కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. ఎండ నుంచి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తాగాలి. వేసవి ఉపశమనం కోసం కర్బూజ, దోసకాయలు, ఇతర పండ్లను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నల్లటి దుస్తులు ధరించకుండా బాగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటలలోపు పని ముగించుకుని ఇంటికి చేరాలి. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్‌ గ్లాసెస్‌, టోపి, హెల్మెట్‌, గ్లౌజ్‌లు వాడాలి. బయటకు వెళ్లే ముందు సన్‌ స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. మసాలాతో కూడిన ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

Updated Date - 2023-04-19T17:54:03+05:30 IST