BJP: లోక్‌సభ సీట్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2023-06-02T17:04:11+05:30 IST

ఏపీలో కొన్ని లోక్‌సభ (Lok Sabha) సీట్లపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని కాషాయ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

BJP: లోక్‌సభ సీట్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి

తిరుపతి: ఏపీలో కొన్ని లోక్‌సభ (Lok Sabha) సీట్లపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని కాషాయ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 8న విశాఖలో బీజేపీ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్‌షా (Union Minister Amit Shah) పాల్గొననున్నారు. అలాగే 10న తిరుపతి (Tirupati)లో బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆ పార్టీ నిర్ణయించింది. మే 31 నుంచి జూన్‌ 30 వరకూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1,000 మంది ప్రభావిత వ్యక్తుల వద్దకు వెళ్లి వివరించాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో బైకు ర్యాలీలు, సంయుక్త మోర్చాల సమ్మేళనాలు, గ్రామాల్లో రాత్రి బసలు, మండల స్థాయిలో మోదీ మిత్ర తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్షేత్రంలోకి దిగింది.

కన్నడ ఫలితంతో డీలాపడ్డ కమలం

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలకు కన్నడిగుల తీర్పు తీవ్ర నిరాశ కలిగించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వారు డీలాపడిపోయారు. ముఖ్యంగా కర్ణాటకలో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వ్యూహాన్ని మార్చుకోకపోతే ఏపీలో కనిపించకుండా పోతామన్న అభిప్రాయం సీనియర్‌ క్రియాశీల కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరైనా బీజేపీకి ప్రజా ప్రతినిధులు ఉండగా మన రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరు. గత ఎన్నికల్లో నోటా కన్నా బీజేపీకి తక్కువ ఓట్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఇదే. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ డిపాజిట్లు రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఉనికే లేదు. ఇటువంటి రాష్ట్రంలో కొంతైనా పార్టీ మొలకెత్తాలంటే వ్యూహం మార్చి పొత్తులకు వెళ్లాల్సిందేనని కేడర్‌ నుంచి వినిపిస్తోంది.

Updated Date - 2023-06-02T17:04:11+05:30 IST