BJP: టీడీపీ, బీజేపీ పొత్తుపై సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-24T13:54:57+05:30 IST

టీడీపీ, బీజేపీ పొత్తుకు సంబంధించి వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి బీజేపీ పొత్తుతో వెళుతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు కలిసినంత మాత్రాన ఎవరిష్టం వచ్చిన్నట్లు వారు ఊహించుకుంటే .. తామెలా చెబుతామని అడిగారు.

BJP: టీడీపీ, బీజేపీ పొత్తుపై సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ: టీడీపీ (TDP), బీజేపీ(BJP) పొత్తుకు సంబంధించి వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (BJP Leader Somuveerraju) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ చీఫ్ చంద్రబాబుతో (TDP Chief Chandrababu naidu) కలిసి బీజేపీ పొత్తుతో వెళుతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు కలిసినంత మాత్రాన ఎవరిష్టం వచ్చిన్నట్లు వారు ఊహించుకుంటే .. తామెలా చెబుతామని అడిగారు. సమావేశం అయ్యాక.. చంద్రబాబు ఎక్కడా ఆ అంశంపై మాట్లాడలేదని తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై బీజేపీ పార్టీ ముఖ్య నేతలు విమర్శలు చేశారని... ఈ పరిణామాలను ఎలా అయినా ఎవరికి వారు అన్వయించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మీరు అడగటం సహజం.. నేను చెప్పడం ధర్మమని తెలిపారు. ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. ప్రధాని మోడీ (PM Narendra Modi) చేసిన అభివృద్ది, సంక్షేమం అందరికీ కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని.. చూపాలని అడుగుతున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasean Chief Pawan Kalyan), కాపు ఉద్యమ నేత ముద్రగడలు (Mudragada Padmanabham) ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారని... ప్రజా జీవితంలో ఉన్నారని తెలిపారు. వారిద్దరి మధ్య వివాదం... కులపరంగా చూడకూడదని.. కేవలం రాజకీయంగా మాత్రమే చూడాలనేది తన అభిప్రాయంగా సోమువీర్రాజు పేర్కొన్నారు.

ఏపీలో అభివృద్ధి అంతా కేంద్ర చేసిందే...

మోడీ తొమ్మిదేళ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 30 నుంచి ఈరోజు వరకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు వెళ్లామన్నారు. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై మాత్రం చాలా చోట్లా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. రాష్ట్రంలో గాలి మారుతుందని.. కమలం వికసిస్తుందని అన్నారు. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూడా బీజేపీ కమలం వికసిస్తుందనే విశ్వాసం తమకుందన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారని తెలిపారు. ఏ అంశంలో తాము అద్భుతంగా చేశామని చెప్పుకోవడానికి వారికి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. రోడ్ల విషయంలో చర్చ పెడితే.. ఎన్ని రోడ్లు వేశారో రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందా అని నిలదీశారు. ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరిగినా.. అది కేవలం మోడీ చేసిన సాయమే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. కేంద్రం ఇస్తున్న పధకాలకు డబ్ చేసి వారి పేర్లు పెట్టుకోవడమే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం తాము పని చేస్తామని సోమువీర్రాజు వెల్లడించారు.

Updated Date - 2023-06-24T13:58:07+05:30 IST