Jagan Balineni: జగన్ వద్దకు బాలినేని పంచాయతీ..!

ABN , First Publish Date - 2023-05-02T14:30:48+05:30 IST

జిల్లాలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులంతా వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా..

Jagan Balineni: జగన్ వద్దకు బాలినేని పంచాయతీ..!

ప్రకాశం: జిల్లాలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులంతా వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా (Prakasam District)లో ఇప్పటికే పది నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలతో వైసీపీ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ముఖ్య నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు వివాదాల్లో చిక్కుకుంటుండటం ఇబ్బందికరంగా మారింది. రీజనల్‌ కోఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. సీఎంవో నుంచి ధనుంజయరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆయనతో మాట్లాడారు. కానీ బాలినేని తిరిగి కోఆర్డినేటర్‌ పదవి తీసుకునేందుకు సిద్ధంగా లేరని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ విషయంలో దృఢమైన నిర్ణయానికే వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బాలినేని శాంతిపజేసేందుకు నేరుగా సీఎం జగన్ (CM Jagan) రంగంలోకి దిగారు. ఇప్పుడు జగన్ దగ్గరకు బాలినేని పంచాయితీ చేరింది. ఈ రోజు మధ్యాహ్నం జగన్‌ను బాలినేని కలవనున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపై అనిశ్చితి కొనసాగుతోంది. రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదని, అలాగని పార్టీ కార్యక్రమాలకు దూరం కానని బాలినేని తేల్చిచెప్పినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను.. అధిష్ఠానంలోని ఒకరిద్దరు నాయకులు రండి మాట్లాడదామంటూ నేరుగా ఫోన్లోను, మరికొందరు తమ పీఏల ద్వారా ఆహ్వానించినట్లు తెలిసింది. ఇంకోవైపు ప్రకాశం జిల్లా నుంచి పలువురు నేతలు ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ‘వివిధ కారణాలతో పార్టీ పదవిని వదులుకున్నా. పూర్తి సమయాన్ని ఒంగోలు నియోజకవర్గానికే కేటాయిస్తా. పార్టీ కార్యక్రమాలన్నింటిలో పాలుపంచుకుంటా. మళ్లీ జగన్‌ సీఎం కావటమే లక్ష్యంగా పనిచేస్తా’ అని బాలినేని వారితో స్పష్టంచేశారు. 2-3 రోజుల్లో ఆయన ఒంగోలు వస్తారని చెబుతున్నారు. వాస్తవానికి బాలినేని శనివారం ఉదయం సీఎంవో అధికారి ధనుంజయరెడ్డికి ఫోన్‌చేశారు. తాను తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, పార్టీ అధినేత జగన్‌కు తెలియజేయాలని చెప్పినట్లు తెలిసింది. రాజీనామా వ్యవహారం ఏదో రూపంలో టీ కప్పులో తుఫానులా ముగిసినా జగన్‌, బాలినేనిల మధ్య పూర్వపుస్థాయి అనుబంధం కొనసాగకపోవచ్చునని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం బాలినేని వ్యవహారం కూడా జిల్లాలో వైసీపీని కుదిపేస్తోందంటే అతిశయోక్తి కాదు. జగన్‌తో భేటీ తర్వాత బాలినేని దారిలోకి వస్తారో.. లేకపోతే భీష్మించుకు కూర్చుంటారో వేచి చూడాలి.

దీనికి తోడు జిల్లాలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులంతా వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పది నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలతో వైసీపీ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ముఖ్య నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు వివాదాల్లో చిక్కుకుంటుండటం ఇబ్బందికరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసి అభాసుపాలైన మంత్రి సురేష్‌ నియోజకవర్గంలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం పలకక తప్పలేదు. ఇదే సమయంలో ఆ పార్టీకి మరో కీలక నేత అయిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డిలపై ఢిల్లీ లిక్కర్‌ స్కాం ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. మరోవైపు బైజూస్‌ స్కాం కేసులో తాజాగా అరెస్టయిన శనగల శ్రీధర్‌రెడ్డి అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సేఫ్‌ వెల్త్‌ సెల్యూషన్స్‌ అనే సంస్థ దక్షిణ సూడాన్‌ రాజధాని జువాకు ట్రెమడాల్‌ అనే మాత్రలను సరఫరా చేస్తుండగా ముంబైలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో సేఫ్‌ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ అయిన శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆ కంపెనీకి బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణ అనేవారు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. బాలినేని అనే ఇంటి పేరు ఉండడంతో ప్రకాశం జిల్లాలో వారెవరనే విషయంపై చర్చ సాగింది. దీంతో గోవిందరెడ్డి, అరుణలకు బాలినేని కుటుంబంతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ ప్రతిష్ట నానాటికీ దిగజారుతోందన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

Updated Date - 2023-05-02T14:30:48+05:30 IST