Atchannaidu: వివేకా హత్య కేసుతో తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధం

ABN , First Publish Date - 2023-02-01T20:17:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీ టీడీపీ (TDP) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శలు గుప్పించారు.

Atchannaidu: వివేకా హత్య కేసుతో తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీ టీడీపీ (TDP) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శలు గుప్పించారు. జగన్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు (viveka murder case) నుంచి దృష్టి మళ్లించేందుకే జగన్ విశాఖ రాజధాని ప్రకటన చేశారని మండిపడ్డారు. బాబాయ్‌ను చంపినవారిని కాపాడాలని జగన్‌ చూస్తున్నారని అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసుతో తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధం ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టుపెట్టి రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారని, విశాఖలో భూములు దోచుకున్నవారే రాజధాని అంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

జగన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని అధికార పార్టీ చెబుతున్నప్పటికీ.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో ఢిల్లీ పెద్దలను కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు హస్తినకు వెళ్లారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. విశాఖను రాజధానిగా ఢిల్లీలో ప్రకటించి ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ ఈ ప్రకటన చేశారని, అందుకే అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే విశాఖ రాజధాని కాబోతోందని సీఎం జగన్‌ ప్రకటించారనే వాదన తెరపైకొచ్చింది. జగన్‌ ప్రకటనను న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. కోర్టు విచారణలో ఉండగానే విశాఖను రాజధానిగా ఎలా భావిస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని అంటున్నారు. ఇటీవల ఉగాది నుంచి విశాఖను రాజధానిగా చేసుకుని జగన్ పాలన సాగిస్తారని వైసీపీ నేతలు బాహాటంగానే ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అయితే పదేపదే ఈ ప్రకటన చేస్తుండటం గమనార్హం.

Updated Date - 2023-02-01T20:25:28+05:30 IST