CM Jagan: జగన్‌తో భేటీ అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-01T17:47:54+05:30 IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kottam Reddy Sridhar Reddy) వ్యాఖ్యలు, ఆరోపణలపై సీఎంతో చర్చింమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) అన్నారు.

CM Jagan: జగన్‌తో  భేటీ అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు

అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kottam Reddy Sridhar Reddy) వ్యాఖ్యలు, ఆరోపణలపై సీఎంతో చర్చించామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) అన్నారు. రేపటిలోగా నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమిస్తామని తెలిపారు. సీఎం జగన్‌ (CM Jagan) తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కోటంరెడ్డి మిత్రుడితోనే ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ అని నిరూపిస్తామన్నారు. ఆయన భయపడినట్లున్నారని, అయినా నిరూపిస్తామని బాలినేని స్పష్టం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించిందన్నారు.

కాగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు సంచనలంగా మారింది. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి.. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే ఆయన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిచిన సీఎం జగన్.. ఆయనతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కోటంరెడ్డి.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై తానెక్కడా విమర్శలు చేయలేదని చెప్పారు. అధికారుల నుంచి సహకారం లేదనే మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

ఈ పరిణామం తర్వాత అంతా సద్దుమణిగిందని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారన్నారనీ.. ఈ విషయం తనకు ముందు నుంచే తెలుసని అన్నారు. రహస్యాలు మాట్లాడుకొనేందుకు తనకు వేరే ఫోన్ ఉందన్నారు. తన వద్ద 12 సిమ్ కార్డులున్నాయని చెప్పారు. ఫేస్ టైమర్ , టెలిగ్రాం కాల్స్‌ను పెగాసెస్ రికార్డు చేయలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన తనపై ఎందుకు నిఘా పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తనపై నిఘా కోసం ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో వైరల్‌గా మారింది. తన అనుచరులతో మాట్లాడుతూ కోటంరెడ్డి ఈ వాఖ్యలు చేసినట్లు సమాచారం.

Updated Date - 2023-02-01T17:57:05+05:30 IST