AP News: పథకాల పేరుతో ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోంది: సత్యకుమార్
ABN , First Publish Date - 2023-06-05T17:32:14+05:30 IST
పథకాల పేరుతో ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ నేత సత్యకుమార్ (Satyakumar) విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా, కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు.
తిరుపతి: పథకాల పేరుతో ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ నేత సత్యకుమార్ (Satyakumar) విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా, కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం, కేంద్ర నిధుల దారిమళ్లింపుపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)ను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కలవటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకోవడం లేదని తోచిపుచ్చారు. దేశవ్యాప్తంగా 350 బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 8న విశాఖపట్నంలో అమిత్షా, 10న శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా బహిరంగ సభల్లో సత్యకుమార్ ప్రసంగిస్తారని తెలిపారు.
ఏపీలో కొన్ని లోక్‌సభ (Lok Sabha) సీట్లపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని కాషాయ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆ పార్టీ నిర్ణయించింది. మే 31 నుంచి జూన్ 30 వరకూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1,000 మంది ప్రభావిత వ్యక్తుల వద్దకు వెళ్లి వివరించాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో బైకు ర్యాలీలు, సంయుక్త మోర్చాల సమ్మేళనాలు, గ్రామాల్లో రాత్రి బసలు, మండల స్థాయిలో మోదీ మిత్ర తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్షేత్రంలోకి దిగింది.