Rains: ఏపీలో మరో వారం రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2023-03-24T20:32:18+05:30 IST

రాయలసీమ (Rayalaseema) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తమిళనాడు (Tamil Nadu) నుంచి రాయలసీమ, కర్ణాటక (Karnataka) మీదుగా విదర్భ

Rains: ఏపీలో మరో వారం రోజులు వర్షాలు

విశాఖపట్నం: రాయలసీమ (Rayalaseema) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తమిళనాడు (Tamil Nadu) నుంచి రాయలసీమ, కర్ణాటక (Karnataka) మీదుగా విదర్భ వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు, వీటికి తోడు ఉత్తరాదిలో పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే నెల ఐదో తేదీ వరకూ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వారాంతపు బులెటిన్‌లో పేర్కొంది. దీనిలో భాగంగా కోస్తాలో మరో వారం రోజులపాటు అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నందున నెలాఖరు వరకు దేశంలో వడగాడ్పుల ప్రభావం ఉండకపోవచ్చునని వివరించింది.

ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతను నిలువునా ముంచేశాయి. చేతికి అందాల్సిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో బాధిత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వర్షం వేలాది హెక్టార్లలో పంటలకు అపార నష్టం మిగిల్చింది. కోత దశలో ఉన్న అరటి, కొర్ర తదితర పంటలతో పాటు తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటలు తడిసి ముద్దయ్యాయి. అదేవిధంగా బెండ, నూగు, సజ్జ పంటలు మరో 50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం వల్ల మామిడి, అరటి, వరి, నూగు పంటలు దెబ్బతిన్నాయి. నూగు, వరి పంటల్లో నీరు నిలవడం వల్ల పంట నేలకొరిగింది. చేతికొచ్చే పంట నేలకొరగడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వరి, నూగు, సజ్జ పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట ఈదురుగాలులు, వర్షం వల్ల నేలకొరగడంతో రైతులు నష్టాల పాలయ్యారు. వర్షం అంటేనే రైతులు హడలిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షం వస్తుదని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-24T20:32:18+05:30 IST