Bhuma Akhilapriya: నంద్యాల మినహా ఎక్కడైనా అఖిలప్రియ తిరగొచ్చు: హైకోర్టు

ABN , First Publish Date - 2023-02-04T18:19:40+05:30 IST

మాజీమంత్రి అఖిలప్రియ (Bhuma Akhilapriya) నంద్యాల (Nandyala) మినహా ఎక్కడైనా తిరగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అండర్ టేకింగ్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని, పోలీసులిచ్చిన...

Bhuma Akhilapriya: నంద్యాల మినహా ఎక్కడైనా అఖిలప్రియ తిరగొచ్చు: హైకోర్టు

అమరావతి: మాజీమంత్రి అఖిలప్రియ (Bhuma Akhilapriya) నంద్యాల (Nandyala) మినహా ఎక్కడైనా తిరగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అండర్ టేకింగ్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని, పోలీసులిచ్చిన నోటీసును కూడా ఉపసంహరించుకోవాలని హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది. అఖిలప్రియను నంద్యాలకు వెళ్లనివ్వకుండా నోటీసులివ్వడంపై దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌ (House motion petition)పై హైకోర్టులో విచారణ జరిగింది. అఖిలప్రియకు నోటీసులిచ్చి నంద్యాల వెళ్లనివ్వలేదని ఆమె తరపు లాయర్‌ రవితేజ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డికి నోటీసులిచ్చారా అని ప్రభుత్వ లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. అయితే శిల్పారవికి నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టుకు పోలీసులు తెలిపారు. అతను రాకుండా చర్చ ఎలా జరుగుతుందని కోర్టు ప్రశ్నించింది. రేపు (సోమవారం) ఉదయం 9:45 గంటల వరకూ నంద్యాల వెళ్లకుండా.. అఖిలప్రియకు నోటీసులిచ్చామని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. రేపు ఉదయం వరకూ నంద్యాల వెళ్లబోమని, అండర్ టేకింగ్ ఇస్తే.. తాము అఖిలప్రియ నివాసం నుంచి వెళ్లిపోతామని పోలీసులు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి (YCP MLA Shilpa Ravi Chandra Kishore Reddy) అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని మాజీ మంత్రి సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిలప్రియ (TDP Leader)ను నంద్యాల వెళ్లకుండా ఆళ్ళగడ్డలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శిల్పా రవిచంద్రకిషోర్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానంటూ భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. 4న నంద్యాలలోని గాంధీచౌక్ వద్దకు ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకువస్తానని... తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలని, లేదంటూ క్షమాపణ చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు. భూమా అఖిలప్రియ సవాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రిని నంద్యాలకు రానీయకుండా ఆళ్లగడ్డలో హౌస్ అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-02-04T18:19:41+05:30 IST