Munugode By Election: జగదీష్‌రెడ్డి లేకపోతే బాధగా ఉంది: కేసీఆర్
ABN , First Publish Date - 2022-10-30T21:03:39+05:30 IST
తెలంగాణ (Telangana) ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి 20 ఏళ్లలో ఏనాడు మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) లేకుండా ఏ సభలో తాను మాట్లాడలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
నల్లగొండ: తెలంగాణ (Telangana) ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి 20 ఏళ్లలో ఏనాడు మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) లేకుండా ఏ సభలో తాను మాట్లాడలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ (Nalgonda) జిల్లా చండూరుకు బాధతో వచ్చినా, సభలో జగదీష్‌రెడ్డి లేకపోవడం ఇంకా బాధగా ఉందన్నారు. 2001 నుంచి ఉద్యమనాయకుడిగా జగదీష్‌రెడ్డి తనతోనే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. ఏం దాదాగిరి, గూండాగిరి చేసిండని జగదీష్‌రెడ్డిపై నిషేధం విధించారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణంలో ఆయన ప్రచారం చేసుకోవడం తప్పా అని నిలదీశారు. 3వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి మునుగోడు ప్రజలు కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
48 గంటలపాటు ప్రచారం చేయొద్దు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను భుజానెత్తుకున్న మంత్రి జగదీష్‌రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే. జగదీష్‌రెడ్డి ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించారని, ఫలితంగా నియోజకవర్గంలో 48 గంటలపాటు ప్రచారం నిర్వహించరాదంటూ ఆయనపై నిషేధం విధించింది. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యే సమయానికి.. చండూరులో ఆదివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతల్లో మునిగి ఉన్న జగదీష్‌రెడ్డి, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.