హైప్‌ కోసం ఫేక్‌ ప్రచారాలు!

ABN , First Publish Date - 2022-11-04T06:01:59+05:30 IST

సార్‌ మీరు డబ్బులు పంపినా ఇక్కడ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వడం లేద’ంటూ సీఎం కేసీఆర్‌తో మునుగోడుకు చెందిన ఓ కార్యకర్త మాట్లాడినట్లు మార్ఫింగ్‌ ఆడియో ..

హైప్‌ కోసం ఫేక్‌ ప్రచారాలు!

సామాజిక మాధ్యమాలు వేదికగా రాష్ట్రంలో బురద రాజకీయాలు

మార్ఫింగ్‌ ఆడియోలు.. తప్పుడు పోస్టులు

మునుగోడు ఉప ఎన్నికలో పరాకాష్ట

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘సార్‌ మీరు డబ్బులు పంపినా ఇక్కడ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వడం లేద’ంటూ సీఎం కేసీఆర్‌తో మునుగోడుకు చెందిన ఓ కార్యకర్త మాట్లాడినట్లు మార్ఫింగ్‌ ఆడియో వదిలారు! బీజేపీ ఓడిపోతోంది... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజీనామా చేస్తున్నారంటూ మరో దుష్ప్రచారం! కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్రవంతి సీఎం కేసీఆర్‌ను కలిసారని, కర్నె ప్రభాకర్‌ బీజేపీలోకి వెళ్తున్నారని, ఈటలతో కలిసి మాట్లాడారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు! ఇలా మా వరకు మేం బురద చల్లుతాం.. దాన్ని కడుక్కుంటావో ఉంచుకుంటావో నీ ఇష్టమన్న రీతిలో రాష్ట్రంలో బురద రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఫేక్‌ ప్రచారాలతో ప్రజల్లో అప్పటికప్పుడు హైప్‌ పెంచుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలు సొంత ఐటీ విభాగాలను నియమించుకుని సామాజిక మాధ్యమాల వేదికగా ఫేక్‌ ప్రచారాలకు పాల్పడుతున్నాయి. అదేవిధంగా ఫేక్‌ అకౌంట్లతో ఒకరిపై మరొకరు బురద చల్లుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వారూ వీరు అని చెప్పలేం.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకులపై కూడా దుష్ప్రచారాలు చేస్తుండడంతో అవి తప్పుఅని నిరూపించుకోవడానికి సదరు నాయకులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటువంటి సోషల్‌ మీడియా ఫేక్‌ ప్రచారాలు ప్రజలను సైతం విస్మయానికి గురిచేశాయి. స్మార్ట్‌ ఫోన్లు, తక్కువ ధరకే ఇంటర్నెట్‌ డేటా వస్తుండటంతో అన్ని వయసుల వారు.. సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీలే కాకుండా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఐటీ సైన్యాలు ఏర్పడ్డాయి. ఎదుటి పార్టీపై ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇతర మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పించడమే పనిగా. తమ నేతలను సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేేసందుకు నిరంతరం పనిచేస్తున్నాయి. తమకోసం ఇంతలా పనిచేస్తున్న ఐటీ సైన్యాలు పెట్టే పోస్టులకు వచ్చే ప్రతి కామెంట్‌, లైక్‌కు కూడా డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేయడానికి ప్రత్యేకంగా ట్రెండింగ్‌లు నిర్వహించడం పరిపాటిగా మారింది.

Updated Date - 2022-11-04T12:02:20+05:30 IST