హైదరాబాద్‌లో రాకెట్‌ తయారీ కేంద్రం

ABN , First Publish Date - 2022-11-26T04:00:02+05:30 IST

తెలంగాణలో సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించాలన్న

హైదరాబాద్‌లో రాకెట్‌ తయారీ కేంద్రం

సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ, పరీక్షా కేంద్రానికి స్థలం

స్కై రూట్‌ విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్‌ అంగీకారం

తొలి ప్రయత్నంలోనే విజయం.. గర్వకారణం

అభినందన సభలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పేస్‌ టెక్‌ పాలసీని విడుదల చేసిందని, ఈ విధానంతో రాకెట్లను స్టార్ట్‌పలు ఇక్కడే రూపొందించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ స్కైరూట్‌ ప్రైవేట్‌ రంగంలో రూపొందించిన తొలి రాకెట్‌ ‘విక్రమ్‌’ను ఈనెల 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. శుక్రవారం టి-హబ్‌లో నిర్వహించిన అభినందన సభలో మంత్రి పాల్గొని స్కైరూట్‌ వ్యవస్థాపకులు భరత్‌, పవన్‌తోపాటు ప్రాజెక్టులో పాల్పంచుకున్న ఉద్యోగులను అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, స్థలం కేటాయించాలని వ్యవస్థాపకులు చేసిన విజ్ఞప్తికి మంత్రి వెంటనే అంగీకారం తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. రాకెట్‌ వంటి సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదని, దీనిని సంస్థ తొలి ప్రయత్నంలోనే అందుకోవడం గర్వకారణమని అన్నారు. 26న(శనివారం) శ్రీహరికోట నుంచి ఉపగ్రహ ప్రయోగం చేయబోతున్న ధ్రువ సైతం హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీ అని, తద్వారా దేశం మరో విజయాన్ని చూడబోతోందని చెప్పారు.

టి-వర్క్స్‌లో రాకెట్‌ డిజైన్‌

అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ టి-హబ్‌ ఏర్పాటుతో స్టార్ట్‌పలకు ప్రోత్సాహకరంగా ఉందని, దీంతో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయని స్కైరూట్‌ వ్యవస్థాపకులు భరత్‌, పవన్‌ అన్నారు. ‘విక్రమ్‌’ మోడల్‌ను ప్రయోగానికి కొద్ది రోజుల ముందు టి-వర్క్స్‌లో రూపొందించామని, ఇందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డామని తెలిపారు. 2018లో ఇద్దరితో స్కైరూట్‌ ప్రారంభించామని, అనేక కష్టాలు ఎదుర్కొన్నామని వివరించారు. స్పేస్‌ టెక్‌ పాలసీ ప్రకటించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు. దీంతో ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. స్పేస్‌ టెక్‌ స్టార్ట్‌పలను టి-హబ్‌లో ప్రోత్సహించేందుకు ఐఐటీ తిరుపతితో ఒప్పందం కుదుర్చుకున్నామని టి-హబ్‌ సీఈవో శ్రీనివాస్‌ చెప్పారు. కార్యక్రమంలో టి-వర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపురి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T04:00:03+05:30 IST