అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే పాలన

ABN , First Publish Date - 2022-11-27T03:46:06+05:30 IST

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సర్కారు పాలన కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలు,

అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే పాలన

తెలంగాణ దేశానికే ఆదర్శం: కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సర్కారు పాలన కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలు, పేదల సాధికారత కోసం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వివిధ భాషలు, మతాలు, సంస్కృతి సంప్రదాయాలతో.. భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారత దేశ సమైక్యతను.. రాజ్యాంగం అందించిన లౌకిక వాద, సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కేసీఆర్‌ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత వివక్షకు అతీతంగా.. దేశ పౌరులందరినీ సమానంగా పరిగణిస్తుందని కేసీఆర్‌ అన్నారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ అందించిన ఆర్టికల్‌-3 ను అనుసరించి తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ మహనీయుని పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఘన నివాళి అర్పించిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు.

Updated Date - 2022-11-27T03:46:07+05:30 IST