KTR: కిషన్ రెడ్డికి కేటీఆర్ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-12-27T21:53:39+05:30 IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు విమర్శించారు.

KTR: కిషన్ రెడ్డికి కేటీఆర్ సూటి ప్రశ్న
KTR, Kishan Reddy

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును (TRS MLAs poaching case) హైకోర్ట్ సిబిఐ(CBI)కి బదిలీ చేయాలని ఇచ్చిన తీర్పుపై బీజేపీ(BJP) నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Miniister Kishan Reddy) స్పందించిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు (BRS working president KTR ) విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగిస్తే 'బీజేపీ విజయం' అని సంబరాలు చేసుకోవడంలో మర్మం ఏంటో చెప్పాలన్నారు. ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లిగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులు బయట పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

స్కాములో దొరికిన స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్లు.. ఈ కుట్ర కేసు సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరని సూటిగా ప్రశ్నించారు. బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. వెన్నులో వణుకు మొదలైందని, అప్పుడు భుజాలు తడుముకుని.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారన్న కెటియార్, సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఒకప్పుడు సిబిఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి ఉండేదని, ఇవ్వాళ సిబిఐకి కేసు అప్పజెప్తే సంబరాలు చేసుకుంటున్నారంటేనే, ఆ సంస్థను బిజెపి హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుందని కేటీఆర్ అన్నారు.

కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు బిజెపి వ్యవహారం ఉందని కేటీఆర్ అన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బిజెపి కాంగ్రెస్‌నే మించిపోయిందన్నారు. సీబీఐ దర్యాప్తుతోపాటు... దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. దొరికిన ముగ్గురు దొంగలకు లై డిటెక్టర్ టెస్టులు చేస్తే వాళ్లకూ.. బీజేపీ నేతలకు ఉన్న బంధం ఏంటో తేటతెల్లమైతుందన్నారు. దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు.

అధికార బలంతో ఏమైనా చేయొచ్చనే కుటిలనీతి బిజెపిదన్న కేటీఆర్, బీజేపీని కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ తమకు లేదని ఎద్దేవా చేశారు. బిజెపి దగ్గర విషయం లేదు కాబట్టే 8 ఏళ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో ‘విషప్రయోగం’ చేస్తున్న మాట నిజంకాదా అని ప్రశ్నించారు. బిజెపి దగ్గర సరుకు లేదు కాబట్టే...ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని.. రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా ఇక్కడా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి... 'ఆపరేషన్ లోటస్ ' బెడిసి కొట్టి అడ్డంగా దొరికిన దొంగలు బిజెపి నేతలని కేటీఆర్ ఆరోపించారు.

నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరన్న కేటీఆర్ ఈ విషయంలో సరైన సమయంలో బిజెపిపై తీర్పు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.

Updated Date - 2022-12-27T23:19:53+05:30 IST