TRS MLAs Poaching Case: బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-29T18:35:14+05:30 IST

మొయినాబాద్ ఫామ్హౌజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TRS MLAs Poaching Case: బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్హౌజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ (BJP) దక్షిణాది రాష్ట్రాల విస్తారక్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేసినవారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తానంటే తెలంగాణ (Telangana)లో ఎవరికీ తెలియదని, తన పేరు ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారని పేర్కొన్నారు. ఇక్కడున్న నాయకులు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి శాపమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారని బీఎల్ సంతోష్ దుయ్యబట్టారు. వాస్తవానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన. అధికారులు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.

విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ (Arrest) చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బీఎల్ సంతోష్ విచారణకు హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. సిట్ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్‌ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు హైకోర్టు నిర్దేశించింది. సంతోష్‌కు సిట్‌ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. సంతోష్‌కు నోటీసు అందజేయడానికి ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, ఆయనకు నోటీసు అందజేయడానికి తమకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ సిట్‌ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. అదే సమయంలో, సిట్‌ నోటీసును సవాల్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 41ఏ నోటీసు జారీ చేయడానికి కూడా సింగిల్‌ జడ్జి నుంచి సిట్‌ అనుమతి తీసుకోవాలా? లేదా? రోజువారీ దర్యాప్తుపై కూడా సింగిల్‌ జడ్జి పర్యవేక్షణ ఉండాలా? అనే అంశాలపై డివిజన్‌ బెంచ్‌ నుంచి స్పష్టత తీసుకునేందుకు ఇరు వర్గాలకు స్వేచ్ఛ ఇస్తున్నామని జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఏదైనా అంశంపై సిట్‌ తనకు అవసరమైతే అనుమతి తీసుకోవాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల్లో ఉంది. అనుమతి అంటే ఏమిటనే అంశంపై డివిజన్‌ బెంచ్‌ వద్ద స్పష్టత తీసుకోండి. రోజువారీ దర్యాప్తు పురోగతిని కూడా పర్యవేక్షించాలా? ఏయే అంశాలపై సిట్‌ హైకోర్టు అనుమతి తీసుకోవాలి? అనే అంశాలపై కూడా స్పష్టత తీసుకోండి’’ అని తెలిపింది.

అయితే ‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీనియర్‌ ఐపీఎస్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో(నంబరు 63)ను కొట్టేసింది. ఇప్పటివరకు సిట్‌ చేసిన దర్యాప్తును, సిట్‌ ఏర్పాటుకు ముందు దర్యాప్తు అధికారి(ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌) చేసిన దర్యాప్తును కొట్టేసింది. ఆ దర్యాప్తు చెల్లదని స్పష్టం చేసింది. నిందితులు, ప్రతిపాదిత నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లను అనుమతించింది. మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

Updated Date - 2022-12-29T19:19:05+05:30 IST