team India: భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు.. ఇంటికొచ్చేస్తుంది

ABN , First Publish Date - 2022-10-28T17:54:04+05:30 IST

జింబాబ్వే చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ విమర్శించిన మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్.. అంతటితో ఆగకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్‌ జట్టుపైనా అతి అంచనా వేశాడు. వరల్డ్ కప్ నుంచి భారత్ వచ్చేవారమే ఇంటికి తిరిగొస్తుందని అన్నాడు

team India: భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు.. ఇంటికొచ్చేస్తుంది

ఇస్లామాబాద్: టీ20 వరల్డ్ కప్‌ (t20 World cup2022) సూపర్-12 దశలో జింబాబ్వే (Zimbabwe) చేతిలో ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్‌ (pakistan) ఆటగాళ్లపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమీ-ఫైనల్ చేరుకునే అవకాశాలు సంక్లిష్టమవ్వడంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ పాక్ జట్టుపై తీవ్రంగా మండిపడ్డాడు. బాబర్ ఆజమ్ చేతకాని కెప్టెన్ అని, వరల్డ్ కప్‌ నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించినట్టేనని వ్యాఖ్యానించాడు. అయితే అంతటితో ఆగకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్‌ జట్టుపైనా అతి అంచనా వేశాడు. వరల్డ్ కప్ నుంచి భారత్ వచ్చేవారమే ఇంటికి తిరిగొస్తుందని అన్నాడు. సెమీ-ఫైనల్స్ నుంచి నిష్క్రమిస్తుందని పేర్కొన్నాడు. ‘‘ ఈ వారమే పాకిస్తాన్ ఇంటికొస్తుందని ముందే చెప్పాను. అదే జరగబోతోంది. ఇండియా కూడా అంతే. వచ్చేవారమే ఇంటికొస్తుంది. సెమీ-ఫైనల్స్ ఆడి తిరిగొచ్చేస్తారు. భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు. పాక్‌తో సమానమే’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

పాక్ కెప్టెన్‌పై మండిపాటు..

ప్రతిష్టాత్మక పెర్త్ క్రికెట్ గ్రౌండ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలవ్వడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ను విశ్లేషించిన అక్తర్... పాక్ ఎలాంటి వ్యూహాలు లేకుండానే మైదానంలోకి దిగిందని దుయ్యబట్టాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ పనికిమాలినవాడని ఈ ఓటమి తెలియజేస్తోందని అభివర్ణించాడు. ‘‘ మన టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాలని చెబుతూనే ఉన్నాను. అలాగైతేనే విజయవంతమవ్వగలం. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. ఇలాగైతే స్థిరంగా రాణించడం కష్టమే. పాకిస్తాన్‌కు చేతకాని కెప్టెన్ ఉన్నాడు. పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించింది. నవాజ్ చివరి ఓవర్ వేసిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాం’’ అని అక్తర్ మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

జట్టులో మార్పులు, బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పు వంటి కొన్ని సూచనలు కూడా చేశాడు. ‘‘ బాబర్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయాలి. షాహిన్ షా అఫ్రిదీ ఫిటినెస్ పెద్ద ఎదురుదెబ్బ. కెప్టెన్సీ, నిర్వహణలో పెద్ద లోపాలుగా కనిపిస్తున్నాయి. మీరు తిరిగి పుంజుకోగలరు. కానీ మీరు ఏలాంటి క్రికెట్ ఆడుతున్నారు?. ప్రత్యర్థి జట్టు మిమ్మల్ని గెలవనిస్తుందనే భావనలో ఉండొద్దు.’’ అని అక్తర్ సూచనలు చేశాడు. కాగా సూపర్-12లో భాగంగా పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్‌పై ఆడనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్లే ఆఫ్ అవకాశాలను వదులుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2022-10-28T17:54:05+05:30 IST