Dhaka Test: భారత్‌ను గెలిపించిన అశ్విన్, అయ్యర్.. సిరీస్ మనదే!

ABN , First Publish Date - 2022-12-25T10:56:52+05:30 IST

టెస్టు మ్యాచ్‌లకు కాలం చెల్లిందని ఎవరన్నారు? టెస్టులు చప్పగా సాగుతాయని ఎవరు చెప్పారు? భారత్-బంగ్లాదేశ్

Dhaka Test: భారత్‌ను గెలిపించిన అశ్విన్, అయ్యర్.. సిరీస్ మనదే!
Team India

ఢాకా: టెస్టు మ్యాచ్‌లకు కాలం చెల్లిందని ఎవరన్నారు? టెస్టులు చప్పగా సాగుతాయని ఎవరు చెప్పారు? భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇక్కడి షేర్ బంగ్లా నేషనల్ స్టేడింయలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్టు చూసిన వారు టెస్టులపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఖాయం. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ.. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)-శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఆడిన తీరు చూసి అభిమానులు ముచ్చటపడ్డారు. కేఎల్ రాహుల్(2), శుభమన్ గిల్(7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1), రిషభ్ పంత్(9) వంటి స్టార్ ఆటగాళ్లు బ్యాట్లు ఎత్తేసిన వేళ అశ్విన్, అయ్యర్ అసమాన పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు అక్షర్ పటేల్ (34) పరుగులతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

45/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా(Team India)కు శనివారం మొదలైన ఎదురుదెబ్బలు కొనసాగాయి. 56 పరుగుల వద్ద ఉనద్కత్ (13), 71 పరుగుల వద్ద రిషభ్ పంత్ (9), 74 పరుగుల వద్ద అక్షర్ పటేల్ (34) పెవిలియన్ చేరడంతో ఇక భారత్ పనైపోయిందని అభిమానులు ఉసూరుమన్నారు. అయితే, క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ తొలుత నెమ్మదిగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత సింగిల్స్ తీస్తూ, సంయమనంతో ఆడుతూ జట్టును విజయ తీరాలవైపు నడిపించారు. ఇలాంటి సమయాల్లో క్రీజులో పాతుకుపోవడమెలానో తెలిసిన అశ్విన్ తన అనుభవాన్ని రంగరించి క్రీజులో పాతుకుపోయాడు. అయ్యర్‌కు అండగా నిలుస్తూ చక్కని ప్రోత్సాహం అందించాడు. చివర్లో మెహదీ హసన్ బౌలింగులో రెండు వరుస ఫోర్లు కొట్టి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అయ్యర్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేయగా, అశ్విన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు.

మరోవైపు, తొలుత త్వరత్వరగా మూడు వికెట్లు పడగొట్టిన బంగ్లదేశ్ బౌలర్లు అయ్యర్-అశ్విన్ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఐదు వికెట్లు పడగొట్టి భారత వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించిన మెహదీ హసన్ కానీ, రెండు వికెట్లు తీసిన షకీబల్ కానీ అశ్విన్, అయ్యర్‌పై ప్రభావం చూపలేకపోయారు.

Updated Date - 2022-12-25T11:06:34+05:30 IST