Nerella Venu Madhav: ఎన్టీఆర్ ఆ పాత్రకు ఎంచుకోవడంతో మారిపోయిన దశ.. అమెరికా అధ్యక్షుడినే ఆశ్చర్యపరిచిన నేరెళ్ల..!

ABN , First Publish Date - 2022-12-28T12:54:10+05:30 IST

యుద్ధ సమయంలో దేశానికి ఆలంబనగా ‘జాతీయ రక్షణ నిధి’ కోసం నిధులు సేకరించాలని నందమూరి తారకరామారవు పూనుకున్నారు. నిధుల సేకరణలో భాగంగా ‘జయం మనదే’ నాటకం వేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. పాత్రలకు తగిన నటుల ఎంపిక దాదాపు ముగిసింది, ఒక్కటి తప్ప..

Nerella Venu Madhav: ఎన్టీఆర్ ఆ పాత్రకు ఎంచుకోవడంతో మారిపోయిన దశ.. అమెరికా అధ్యక్షుడినే ఆశ్చర్యపరిచిన నేరెళ్ల..!

వేయిగొంతుకల నేరెళ్ల జయంతి- నేడు ప్రపంచ మిమిక్రీ దినోత్సవం

'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' నేరెళ వేణుమాధవ్ ( Nerella Venu Madhav ) మిమిక్రీ ప్రదర్శనలు వీడియోలుగా లేకపోతే మిమిక్రీ ద్వారా ఆయన చేసిన అద్భుతాల్ని మిత్ (myth)గా, అభూతకల్పనగా అనిపించేవి నేటి తరానికి. అంతటి అసాధ్యాలని అనుకరించి చూపారాయన. ఆయన అనుకరించిన ప్రముఖుల్లో నాటి మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్యులు. మిగతా ప్రముఖుల గొంతులు మాత్రమే మిమిక్రీ చేస్తే, సర్వేపల్లి గొంతుని ఆయన వేషంలోనే అనుకరించాల్సి వచ్చింది నేరెళ్లకి.

ఎన్టీఆర్ ఎంచుకున్న నేరెళ్ల

ఇండో- పాకిస్తాన్ యుద్ధం- 1965. డా సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా, లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నారు. రెండవ కాశ్మీర్ యుద్ధంగా కూడా పిలవబడ్డ ఆ యుద్ధ సమయంలో దేశానికి ఆలంబనగా ‘జాతీయ రక్షణ నిధి’ కోసం నిధులు సేకరించాలని నందమూరి తారకరామారవు (NTR) పూనుకున్నారు. నిధుల సేకరణలో భాగంగా ‘జయం మనదే’ నాటకం వేయాలని ఎన్టీఆర్ (NTR Movies) సంకల్పించారు. పాత్రలకు తగిన నటుల ఎంపిక దాదాపు ముగిసింది, ఒక్కటి తప్ప; అది డా సర్వేపల్లి రాధాకృష్ణన్ పాత్ర. దేశభక్తి ప్రభోదం ప్రధానంగా సాగే 'జయం మనదే' నాటకానికి సర్వేపల్లి పాత్ర చాలా ముఖ్యం. సైనికులని ఉత్తేజం చేసే ప్రసంగం కూడా ఇవ్వాలి ఆ పాత్ర. దానికి తగిన నటుడు ఎవ్వరా అని వెదుకుతుంటే, ఎన్టీఆర్ కు సిఫార్సు చేయబడ్డ పేరు- నేరెళ్ల వేణుమాధవ్ ( Nerella Venu Madhav Birth anniversary ). 1950ల నుంచీ నేరెళ్ల మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తున్నా, కొన్ని సినిమాలలో వేషాలు వేసినా, 1965 నాటికి ఆయన అంత పాపులర్ కాలేదు. కానీ, ప్రసిద్ధ దర్శకులు బి ఎన్ రెడ్డికి నేరేళ్ల ప్రతిభ తెలుసు, ఆయన ప్రోద్బలంతోనే సినిమాల్లో నటించడం మొదలెట్టారు నేరెళ్ల. సర్వేపల్లి పాత్రకి నేరెళ్ల అన్నివిధాలా సరిపోతారని ఎన్టీఆర్ కు స్వయానా బిఎన్ రెడ్డి సూచించారట.

సైనికుల్ని ఉద్దేశించి సర్వేపల్లి ఇంగ్లీషులో చేసిన 3- పేజీల ఉపన్యాసాన్ని, తెలుగులో ఆయన గొంతుని అనుకరిస్తూ నేరెళ్ళ చెప్పడం ఆ నాటకానికే హైలెట్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఒక సామాన్య సైనికుడిగా నటించగా, జనరల్ జె ఎన్ చౌధురిగా కైకాల సత్యనారాయణ నటించిన ఆ నాటకం ద్వారా వసూలైన మొత్తాన్నీ జాతీయ రక్షణ నిధికి విరాళం ఇచ్చారు ఎన్టీఆర్.

News-3.jpg

జీవితాన్ని మలుపు తిప్పిన ప్రదర్శన

సర్వేపల్లి స్వరాన్ని అనుకరించడమే కాకుండా, ఆయన రూపాన్ని కూడా అభినయించడం నేరెళ్ల ( Nerella Venu Madhav Biography ) జీవితంలో ఒక మలుపు అని చెప్పవచ్చు. సర్వేపల్లి స్వయంగా వచ్చారనుకొని ప్రేక్షకులు లేచి నిలబడేవారు. సర్వేపల్లి ప్రదర్శనే ఆయనని ఐక్యరాజ్యసమితి (United Nations Organisation)కి తీసుకువెళ్లింది. ఆ అంతర్జాతీయ వేదిక మీద అప్పటి అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ (John F. Kennedy) గొంతును మిమిక్రీ చేయడం, దానికి యునైటెడ్ నేషన్స్ సభ్యులు కరతాళధ్వనులు లేచి నిలబడి అభినందించడం విశేషం.

తన పాత్ర వేయడం, ప్రసంగాన్ని అనుకరించడం, కెన్నడీ గొంతును కూడా మిమిక్రీ చేయడం తెలుసుకొని సర్వేపల్లి స్వయానా ఆహ్వానించారు నేరెళ్లని. నేరెళ్లని సర్వేపల్లి దగ్గరకు తీసుకువెళ్లింది చిత్తూరు నాగయ్య కావడం ఇంకా విశేషం. ఎందుకంటే, నేరెళ్ల ( Nerella Venu Madhav Life Story ) మిమిక్రీలోకి రావడానికి ప్రేరణే నాగయ్య. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే చిత్తూరు నాగయ్య సినిమాలంటే పడిచచ్చేవారాయన.

“స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే నాకు చిత్తూరు నాగయ్య గారి సినిమాలంటే పిచ్చి ఇష్టం. గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన ఎన్నిసార్లు చూసి ఉంటానో! ఇంట్లోంచి డబ్బులు కాజేసి మరీ సినిమాలు చూసి వచ్చి, నాన్నతో తన్నులు తినేవాణ్ణి. ఆయన కొట్టే దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే అమ్మ బుజ్జగించేది. 'ఇవన్నీ వొదిలేయ్. హాయిగా చదువుకో, చదువు కడుపు నింపుతుందిగానీ సినిమాలు కాదు', అని బతిమాలి చెప్పేది. అయినా సరే.. నాగయ్యగారి సినిమాల మోజు, ఆ గొంతు, ఆ నటన.. మీద ప్రేమ నన్ను నిద్రపోనిచ్చేవి కాదు,” అని చెప్పారు నేరెళ్ల పలు ఇంటర్వ్యూల్లో.

'దుఖ్ కా హై దునియ బాబా...', 'హాయి సఖీ హాయి సఖీ...' వంటి నాగయ్య పాటలు అచ్చం ఆయనలానే పాడేవారు. నాగయ్య డైలాగుల్ని అనుకరించడంతో 15 ఏట నుంచి మొదలయ్యింది నేరెళ్ల మిమిక్రీ ప్రయాణం. అటువంటి తన ఐకాన్ స్టార్ నాగయ్యే తనని సర్వేపల్లి దగ్గరకి తీసుకువెళ్లడం తన జీవితంలో మరపురాని ఘట్టం అనేవారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సర్వేపల్లి ముందు ఆయన గొంతునే మిమిక్రీ చేశారట నేరెళ్ళ ( Nerella Venu Madhav Mimicry ). భానుమతి గొంతుని కూడా మిమిక్రీ చేయడం సర్వేపల్లిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేసిందట.

News-2.jpg

విశ్వవ్యాప్తమైన కీర్తి

1932 డిసెంబరు 28న వరంగల్ మట్టెవాడలో ప్రముఖ వ్యాపారవేత్త నేరెళ్ల శ్రీహరి- శ్రీలక్ష్మి దంపతులకి 12వ సంతానంగా పుట్టారు వేణుమాధవ్. తండ్రి బహుభాషావేత్త, సాహిత్యాభిమాని కావడం వల్ల వరంగల్ వచ్చే ప్రఖ్యాత సాహితీవేత్తలు, కళాకారులు వీరి ఇంట్లోనే బస చేసేవారు, సాహితీ గోష్ఠులు, కళాప్రదర్శనలూ జరిగేవి. వీటన్నింటి ప్రభావం నేరెళ్ల ( Nerella Venu Madhav ) మీద ఉంది. 'వర దక్షిణ', 'గయ్యాళి గంగమ్మ' వంటి చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాల్లో హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే నటించారు. మంచి నటులు కావడం వల్ల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, వాటి మీద పెద్దగా ఆసక్తి చూపలేదాయన. మిమిక్రీలోనే కొనసాగారు.

వ్యక్తులనే కాకుండా సంగీత వాద్యాలని, సన్నివేశాల్ని కూడా అనుకరించి మిమిక్రీ కళని కొత్తపుంతలు తొక్కించారు. ఇంగ్లీషు సినిమాల్లోని నటీనటుల గొంతులు, ముఖ్యమైన సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపించడం ఆయన ప్రత్యేకత. చార్ల్ టన్ హెస్టన్ (Charlton Heston) మోజెస్ (Moses) గా సిసిల్ డెమిల్లి (Cecil B. DeMille) దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ది టెన్ కమాండ్మెంట్స్ (The Ten Commandments)' సినిమాలోని కీలక సన్నివేశాన్ని అరగంట పాటు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్, గుర్రాల సకిలింపులు, డెక్కల చప్పుడు... అన్నింటితో సహా మిమిక్రీ చేయడం నేరేళ్ల పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. హామ్లెట్ (Hamlet), మెకన్నాస్ గోల్డ్ (McKanna’s Gold) వంటి ప్రసిద్ధ హాలీవుడ్ సినిమాల సీన్స్ కూడా అనుకరించి ప్రశంసలు పొందారు. 2018 జూన్ లో భౌతికంగా దూరమైనా ఆయన కీర్తి అజరామరమయ్యింది. అందుకే నేరేళ్ళ పుట్టినరోజు- డిసెంబర్ 28- ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరపబడుతోంది.

Updated Date - 2022-12-28T13:01:09+05:30 IST