TikTok Ban: అన్నంత పనిచేసిన అగ్రరాజ్యం.. కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

ABN , First Publish Date - 2022-12-15T13:08:23+05:30 IST

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై (TikTok) నిషేధం విషయమై తీసుకొచ్చిన కీలక బిల్లుకు బుధవారం అమెరికన్ సెనేట్ (US Senate) ఆమోదం తెలిపింది.

TikTok Ban: అన్నంత పనిచేసిన అగ్రరాజ్యం.. కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

వాషింగ్టన్: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై (TikTok) నిషేధం విషయమై తీసుకొచ్చిన కీలక బిల్లుకు బుధవారం అమెరికన్ సెనేట్ (US Senate) ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై బార్ ఫెడరల్ ఉద్యోగులు (Bar Federal Employees) ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలలో టిక్‌టాక్‌ను ఉపయోగించకూడదు. ఆ దేశంలోని రిపబ్లికన్ పార్టీకి (Republic Party) చెందిన మార్కో రూబియో, మైక్ గల్లాఘర్, డెమోక్రాటిక్ పార్టీకి (Democratic Party) చెందిన రాజా కృష్ణమూర్తి ఈ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిఫెన్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్‌మెంట్స్ టిక్‌టాక్‌పై బ్యాన్ విధించాయి. కాగా, అమెరికా వాసులపై నిఘా కోసం చైనా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చనే ఆందోళన నేపథ్యంలోనే ప్రధానంగా యూఎస్ ఎంపీలు ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇక ఈ బిల్లు సెనేట్‌లో పాస్ కావడంతో రష్యా, చైనా ప్రభావం ఉన్న ఏ సోషల్ మీడియా కంపెనీనైనా బ్లాక్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభించిందని నిపుణులు చెబుతున్నారు.

గతంలో ఈ బిల్లుపై సెనేటర్ జోష్ హాలీ మాట్లాడుతూ.. "టిక్‌టాక్ వల్ల యునైటెడ్ స్టేట్స్‌ సెక్యూరిటీకి ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ పరికరాల్లో దీనికి స్థానం లేదు" అని చెప్పారు. ఇదిలాఉంటే.. చైనా సర్కార్‌తో తాము డేటాను పంచుకోవడం లేదని టిక్‌టాక్ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే యూఎస్ సెనేట్‌లో బిల్లు రావడంపై మంగళవారం స్పందించిస్తూ 'రాజకీయ ప్రేరేపితమైన నిషేధం' అని టిక్‌టాక్ వ్యాఖ్యానించింది. కొందరు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును ముందుకు తీసుకెళ్తున్నారని చురకలు అంటించింది కూడా. దీనివల్ల అమెరికా జాతీయ భద్రతకు అదనంగా లభించే ప్రయోజనం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. కాగా, మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనే టిక్‌టాక్‌పై బ్యాన్‌కు యత్నించింది అగ్రరాజ్యం. కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదు.

Updated Date - 2022-12-15T13:24:47+05:30 IST