Bomb Cyclone: అమెరికాలో 'మంచు' విషాదం.. తెలుగు జంట గల్లంతు

ABN , First Publish Date - 2022-12-28T07:23:10+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు బారిన పడి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన భార్యాభర్తలు గల్లంతయ్యారు.

Bomb Cyclone: అమెరికాలో 'మంచు' విషాదం.. తెలుగు జంట గల్లంతు

మంచులో కార్లు.. లోపల మృతదేహాలు

63కి మృతులు.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

పెదనందిపాడు, డిసెంబరు 27: అగ్రరాజ్యం అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు బారిన పడి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన భార్యాభర్తలు గల్లంతయ్యారు. వీరిలో భార్య మృతి చెందగా, భర్త ఆచూకీ తెలియరాలేదు. వివరాలివీ.. పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ముద్దన సుబ్బారావు కుమారుడు ముద్దన నారాయణకు 2010లో అన్నపర్రు గ్రామానికి చెందిన హరితతో వివాహం జరిగింది. 2012లో ఉద్యోగరీత్యా నారాయణ మలేషియా వెళ్లారు. అక్కడి నుంచి 2016లో అమెరికాలోని అరిజోనా వెళ్లి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు పిల్లలు. తాజాగా అరిజోనాలో మంచు తుఫాను కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేకమైంది పౌరులు మంచుకోరల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డారు.

ఈ క్రమంలోనే.. భారత కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నారాయణ దంపతులు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు బయటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మంచుచరియలపై నడుకుంటూ వెళ్తున్న సమయంలో కాలుజారి సరస్సులో పడి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా మూడు గంటల అనంతరం భార్య హరిత మృతదేహం లభ్యమయింది. భర్త నారాయణ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గత జూన్‌లోనే నారాయణ కుటుంబం అమెరికా నుంచి స్వగ్రామం వచ్చి వెళ్లింది. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లే ముందు కూడా వీరు తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. తీరా ఈ దుర్ఘటన జరిగినట్టు వారికి సమాచారం అందడంతో ఇక్కడ వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. రెండు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ పిల్లలిద్దరూ ఇంట్లో క్షేమంగా ఉన్నట్టు బంధువులకు సమాచారం అందింది.

Updated Date - 2022-12-28T07:34:29+05:30 IST