Canada: కెనడాలో భారతీయుల హవా.. ఒకే ఏడాదిలో 1లక్ష మందికి శాశ్వత నివాస హోదా

ABN , First Publish Date - 2022-11-08T12:05:03+05:30 IST

కెనడా కొత్త వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62శాతం మంది ఉంటే.. వీరిలో భారతీయులే (Indians) అధికమని ఆ దేశ సెన్సస్ రిపోర్టు-2021 వెల్లడించింది. భారత్ ఏకంగా 18.6శాతం వలసలతో మొదటి స్థానంలో ఉందని ఈ నివేదిక పేర్కొంది.

Canada: కెనడాలో భారతీయుల హవా.. ఒకే ఏడాదిలో 1లక్ష మందికి శాశ్వత నివాస హోదా

ఎన్నారై డెస్క్: కార్మికుల కొరతతో సతమతమవుతున్న కెనడా (Canada) భారీ మొత్తంలో వలసలను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగానే ప్రతియేటా 5లక్షల మంది వలసదారులను (Immigrants) ఆహ్వానం పలకాలని నిర్ణయించినట్లు ఇటీవల కొత్త ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెనడా కొత్త వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62శాతం మంది ఉంటే.. వీరిలో భారతీయులే (Indians) అధికమని ఆ దేశ సెన్సస్ రిపోర్టు-2021 వెల్లడించింది. భారత్ ఏకంగా 18.6శాతం వలసలతో మొదటి స్థానంలో ఉందని ఈ నివేదిక పేర్కొంది. కాగా, 2021లో కెనడా ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 4,05,000 మంది కొత్త వలసదారులను ఆహ్వానించింది. దీంతో సుమారు 1లక్ష మంది భారతీయులు శాశ్వత నివాస హోదాను (Permanent Residency) పొందినట్లు తాజాగా ఆ దేశ జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన కొత్త సర్వే రిపోర్ట్ తెలిపింది.

ఇక 2016-2021 మధ్య కెనడా శ్రామిక శక్తి వృద్ధిలో దాదాపు 80 శాతం వలసదారులు ఉన్నారని నివేదిక తెలియజేసింది. గడిచిన ఐదేళ్లలో కెనడా వలస వెళ్లేవారిలో దాదాపు 70.7శాతం మంది విదేశీయులు ఉపాధిని కలిగి ఉన్నారట. అత్యధికంగా అంటారియో, క్యూబెక్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం, న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్, సస్కట్చేవాన్, మానిటోబాలో ప్రాంతాల్లో ప్రవాసులు భారీ మొత్తంలో ఉపాధి పొందుతున్నారని రిపోర్ట్ పేర్కొంది. ఇక భారతీయుల విషయానికి వస్తే.. అత్యధిక సంఖ్యలో భారతీయులు అంటారియో, బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లలో ఉన్నారట. ఆ తర్వాత అల్బెర్టా, క్యూబెక్‌లలో కూడా మన కమ్యూనిటీలు పెరుగుతన్నాయట. ఇదిలాఉంటే.. మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవితం కోసం భారతీయులు పెద్ద ఎత్తున కెనడాకు వలస వెళ్తున్నారట.

Updated Date - 2022-11-08T12:19:40+05:30 IST