Dubai: 'ఫ్యామిలీ బ్యాలెన్సింగ్' పేరుతో కొత్త దందా.. 'మగబిడ్డ' గ్యారెంటీతో భారతీయ జంటలకు వల

ABN , First Publish Date - 2022-12-08T10:22:16+05:30 IST

భారత్‌లో మగబిడ్డ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే తన తర్వాత వారసత్వం నిలవాలంటే కచ్చితంగా కొడుకే కావాలి.

Dubai: 'ఫ్యామిలీ బ్యాలెన్సింగ్' పేరుతో కొత్త దందా.. 'మగబిడ్డ' గ్యారెంటీతో భారతీయ జంటలకు వల

ఎన్నారై డెస్క్: భారత్‌లో మగబిడ్డ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే తన తర్వాత వారసత్వం నిలవాలంటే కచ్చితంగా కొడుకే కావాలి. ఇది మన దగ్గర తరతరాల నుంచి వస్తున్న భావన. అయితే, ఇప్పుడిప్పుడే దీని నుంచి బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ, చాలా వరకు ఇప్పటికీ మగబిడ్డే కావాలనుకునే వారు ఉన్నారు. దానికోసం ఎంతకైన తెగిస్తారు. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎంత వ్యయానికైనా వెనుకాడరు. ఇదిగో దీన్నే ఇప్పుడు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని భారత్‌లో కొత్త దందా చేస్తున్నాయి. 'మగబిడ్డ' గ్యారంటీతో భారతీయ జంటలకు వల వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న ఐవీఎఫ్ సెంటర్స్ భారతీయ జంటలకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి.

ప్రధానంగా దుబాయ్‌లోని ఈ ఐవీఎఫ్ క్లినిక్‌ల నెట్‌వర్క్ ప్రస్తుతం ఇండియాలో బాగా విస్తరిస్తోంది. మన దగ్గర నడుస్తున్న పాథాలజీ ల్యాబ్‌ల నుండి స్థానిక వైద్యుల వరకు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఏజెంట్ల ద్వారా జంటలు ఈ క్లినిక్‌లకు చేరుకుంటారు. ఆపై ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక దుబాయ్ వెళ్లి బస, వైద్యానికి (ఐవీఎఫ్, ఇతర టెస్టులు) కలిపి మొత్తం రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. కుమారుడు మాత్రమే కావాలనుకునే భారతీయ జంటలు ఈ మొత్తం చెల్లిస్తే చాలంటూ దుబాయ్ ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లు ప్యాకేజీ ప్రకటిస్తున్నాయి.

అసలు ఈ దందా ఎలా బయటపడిందంటే..

ఓ మహిళ తాను క్లయింట్‌గా నటిస్తూ దుబాయ్ కేంద్రంగా ఈ దందా నడిపిస్తున్న ఏజెంట్లు, డాక్టర్లతో మాడ్లాడటం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. ఆమెకు వారు ఈ ప్రాసెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఈ ప్రాసెస్‌లో వారు అవలంభిస్తున్న కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. వారు చెప్పినదంతా విన్న తర్వాత ఆమెకు ఆడిపిల్లలు ఈ ప్రపంచంలోకి రాకుండా అడ్డుకునే ప్రక్రియ మరోసారి తీవ్రమవుతోందని అర్థమైంది. అంతేగాక ఈసారి ఆడ భ్రూణహత్యల నమూనా సరిగ్గా అల్ట్రాసౌండ్‌ను తలపిస్తున్నా, ఈ పద్ధతి దాని కంటే ప్రమాదకరమైనదిగా ఆమె పేర్కొన్నారు.

ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ (PGD)గా పేర్కొంటున్న ఈ పద్దతి ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే లింగ నిర్ధారణకు వీలు కలుగుతుందట. అసలైతే ఐవీఎఫ్ ద్వారా సృష్టించబడిన పిండాలలో జన్యుపరమైన వ్యాధులను గుర్తించడానికి మొదట ఈ టెక్నిక్ ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు దీని ద్వారానే ప్రయోగశాలలో పిండం లింగనిర్ధారణ జరుగుతుంది. అది కూడా చాలా తక్కువ సమయంలో పిండం ఆడ లేక మగ అనేది తేల్చేస్తుంది. ఒకవేళ ఆడపిల్ల అయితే మాత్రం అంతే సంగతులు. మగబిడ్డ అయితేనే భూమి మీదకు వస్తాడు. ఈ ప్రాసెస్‌ను ఆధారంగా చేసుకునే ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా ఉన్న ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఏజెంట్లు భారత్‌లో 100శాతం మగపిల్లాడు గ్యారెంటీ అనే దందాను నడిపిస్తున్నారు.

'ఫ్యామిలీ బ్యాలెన్సింగ్' పేరుతో దందా..

దుబాయ్‌లోని ఈ క్లినిక్‌లు.. కుమారుడి గ్యారెంటీ పేరిట ఇంటర్నెట్‌లో తమ అధికారిక వెబ్‌సైట్లలో ప్రచారం నిర్వహిస్తూ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. అక్కడ అవి తమ వ్యాపారానికి 'ఫ్యామిలీ బ్యాలెన్సింగ్' అని పేరు పెట్టాయి. మొదట వారి ఏజెంట్లు ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లకు సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి కస్టమర్‌లను చేరుకుంటారు. ఆ తర్వాత అసలు ప్రాసెస్ మొదలవుతుంది. కాగా, పీజీడీ ద్వారా పిల్లల లింగ నిర్ధారణకు యూఏఈ (UAE)లో అనుమతి ఉంది. అందుకే అక్కడ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ పేరుతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

ప్రాసెస్ ఏంటంటే..

మొదట ఇండియాలోని క్లినిక్స్ దంపతులిద్దరికి అన్ని టెస్టులు చేస్తాయి. అనంతరం వాటి తాలూకు రిపోర్టును దుబాయ్‌లో ఉండే వైద్యునికి పంపిస్తాయి. వాటిని పరీక్షించిన తర్వాత అక్కడి నుంచి మన దగ్గర ఉన్న క్లినిక్‌లకు కొన్ని సూచనలు వస్తాయి. వాటి ఆధారంగా దంపతులకు ఎలాంటి ట్రీట్‌మెంట్ అవసరం, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడి క్లినిక్స్ స్పష్టంగా వారికి తెలియజేస్తాయి. వాటికి దంపతులు అంగీకరించిన తర్వాత దుబాయ్ పంపించడం జరుగుతుంది. అక్కడ బస, ఐవీఎఫ్, విమాన చార్జీలు ఇలా అన్ని దంపతులే భరించాల్సి ఉంటుంది.

ఇక ప్యాకేజీల విషయానికి వస్తే..

* ఐవీఎఫ్+పీజీడీ - రూ. 7లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.

* కేవలం పీజీడీ అయితే రూ. 4.5లక్షలు అవుతాయి.

* అదే కేవలం ఐవీఎఫ్ అయితే రూ. 4లక్షల నుంచి రూ. 6లక్షల వరకు అవుతుంది.

* ఇక ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఒక్కొ వ్యక్తికి రూ. 10వేల నుంచి 15వేల విమాన టికెట్ ఉంటుంది.

* దుబాయ్‌లో బస కోసం ఇద్దరు వ్యక్తులకు రోజుకి రూ. 4వేల నుంచి రూ. 7వేల వరకు ఉంటుంది.

* మన దగ్గర హర్మోన్ థెరపీ, ఇతర టెస్టులకు మరో రూ. 75వేలు

యూఎన్ఎఫ్‌ఏకు చెందిన 'ద స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్' రిపోర్ట్-2020 ప్రకారం..

* 1970 నుంచి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 14.26 కోట్ల మంది ఆడపిల్లలు భూమి మీదకు రాకముందే గర్భంలోనే విచ్ఛితి కావించబడ్డారు.

* ఇందులో భారత్ వాటా 4.6కోట్లు.

* 2013 నుంచి 2017 వరకు ఇండియాలో 4.60లక్షల మంది ఆడపిల్లలు గర్భంలోనే చంపబడ్డారు.

* అంటే రోజుకు 1,260 మంది, అదే గంటకు 52 మంది ఆడబిడ్డలు అన్నమాట.

* ఇక భూమిపై పడ్డాక కూడా ఆడకూతుళ్లకు రక్షణ లేదు. ఐదేళ్లలోపు ప్రతి 9మందిలో ఒకరు చనిపోతున్నారు.

Updated Date - 2022-12-08T10:37:03+05:30 IST