Rahul Gandhi: నాపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-31T15:19:22+05:30 IST

పాన్-ఇండియా ఫుట్ మార్చ్ 'భారత్ జోడో యాత్ర' కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భద్రతా ఉల్లంఘన' వ్యవహారంపై ఘాటుగా..

Rahul Gandhi: నాపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు

న్యూఢిల్లీ: పాన్-ఇండియా ఫుట్ మార్చ్ 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) 'భద్రతా ఉల్లంఘన' వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. బీజేపీ యాత్రల మాటేమిటని ప్రశ్నించారు. వారు యాత్రలు చేసినప్పుడు ఎలా భద్రత ఇస్తున్నారని నిలదీశారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. శనివారంనాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని హోం శాఖ చెబుతోందని, అలా ఎలా చేయగలనని ప్రశ్నించారు. యాత్రలో తాను కాలినడకనే వెళ్లాలని, అప్పుడు కూడా ఎలా భద్రత ఇవ్వాలో వారికి బాగా తెలుసునని అన్నారు. అకారణంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజలందర్నీ ఐక్యంగా కలిపి ఉంచేందుకు చేపట్టిన యాత్ర ఇదని, ఇప్పటివరకూ భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగిందని చెప్పారు. ప్రజలు కొత్త మార్గంలో ఎలా ఆలోచించాలో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.

టీషర్టుపై రగడ...

భారత్ జోడో యాత్రలో రాహుల్ ధరించిన టీషర్డుపై బీజేపీ విమర్శలపై అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ, టీషర్టుపై రగడ ఎందుకని ప్రశ్నించారు. తనకు చలి అంటే భయం లేదని, అందుకే స్వెట్టర్ వేసుకోలేదని చెప్పారు. ఒకవేళ చలి ఎక్కువైతే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. యాత్రలో తాను ఉత్సాహంగా ఉండటం వెనుక సీక్రెట్ ఏమిటనేది తర్వాత ఒక వీడియో విదుల చేస్తామని నవ్వుతూ చెప్పారు.

విపక్షాల ఐక్యతకు పిలుపు..

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపై నిలవాలని రాహుల్ సూచించారు. ప్రజల్లో అండర్‌కరెంట్‌గా బీజేపీపై వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీకి ప్రత్నామ్నాయ విజన్‌పై విపక్షాల మధ్య సమర్ధవంతమైన సమన్వయం కావాలన్నారు. ప్రతీ విపక్ష నేత భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌తో ఉన్నారని, కొన్ని రాజకీయ అనివార్యతలు ఉన్న విషయాన్ని కూడా తాను అర్ధం చేసుకోగలనని చెప్పారు. విపక్ష నేతల మధ్య పరస్పర గౌరవంపై మాట్లాడుతూ, ఇతర విపక్ష నేతలకు కూడా అసౌకర్యం లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు.

మధ్యప్రదేశ్‌లో గెలుస్తామని రాసిస్తా...

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఆ మాట తాను రాసిస్తానని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎక్కడా కనిపించడం లేదన్నారు. డబ్బులు వెదజల్లి బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయం ఎంపీలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని రాహుల్ చురకలు వేశారు.

Updated Date - 2022-12-31T15:23:06+05:30 IST