Manish Sisodia Vs Himanta Biswa Sarma : పరువు నష్టం కేసులో షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-12-12T16:51:18+05:30 IST

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు సుప్రీంకోర్టు

Manish Sisodia Vs Himanta Biswa Sarma : పరువు నష్టం కేసులో షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Himanta Biswa Sarma, Manish Sisodia

న్యూఢిల్లీ : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారం చుక్కెదురైంది. తనపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) దాఖలు చేసిన పరువు నష్టం కేసును రద్దు చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

హిమంత బిశ్వ శర్మ, ఆయన సతీమణి రినికి భుయాన్ శర్మ ఈ పరువు నష్టం దావాను దాఖలు చేశారు. చర్చను ఈ స్థాయికి దిగజార్చినందుకు పర్యవసానాలను ఎదుర్కొనక తప్పదని మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిసోడియా వాడిన భాషను గట్టిగా ప్రశ్నించింది. ఇటువంటి భాషను ఉపయోగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఉండవలసిందని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

మనీశ్ సిసోడియా ఈ ఏడాది జూన్ 4న న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లను హిమంత బిశ్వ శర్మ అత్యధిక ధరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. శర్మ ఈ కిట్ల కొనుగోలు కాంట్రాక్టును తన భార్య నడుపుతున్న సంస్థకు, తమ కుమారుని వ్యాపార భాగస్వాములు నడుపుతున్న సంస్థలకు అత్యధిక ధరలకు అప్పగించారన్నారు. రూ.600కు లభించే కిట్‌ను రూ.990కి కొనేందుకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ఇది ఓ కుంభకోణమని ఆరోపించారు.

ఈ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఆర్‌సీపీఐ, టీఎంసీ, రాయ్‌జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, తదితర పార్టీలు డిమాండ్ చేశాయి.

Updated Date - 2022-12-12T16:52:15+05:30 IST