Bharat Jodo Yatra : రాజస్థాన్ సీఎంకు రెండు, మూడు విషయాలు చెప్పాను, అవేమిటో మీకు చెప్పను : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-12-13T16:21:48+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి తాను ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు.

Bharat Jodo Yatra : రాజస్థాన్ సీఎంకు రెండు, మూడు విషయాలు చెప్పాను, అవేమిటో మీకు చెప్పను : రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి తాను ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశంసించారు.ఇప్పటికే జరిగినదానికన్నా ఇకపై చేయబోయేది చాలా ముఖ్యమని తెలిపారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా ఆయన రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్నారు.

సవాయ్ మాధోపూర్ జిల్లాలోని కుస్టల గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, చేయవలసిన అవసరం ఉందని తాను భావిస్తున్న రెండు, మూడు పనుల గురించి తాను గెహ్లాట్‌కు చెప్పానని తెలిపారు. ఆ పనులేమిటో తాను వెల్లడించబోనని తెలిపారు. ముఖ్యమంత్రి గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot), రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ వంటి సీనియర్ నేతలు తనతోపాటు ఈ యాత్రలో పాల్గొంటున్నారన్నారు. ప్రజలు చెప్తున్న మాటలను వారు వింటున్నారన్నారు. ప్రజలు చెప్పిన విషయాలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

గోవింద్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించారని గాంధీ తెలిపారు. కాంగ్రెస్ ఇది చేసింది, అది చేసింది అని ఆయన చెప్పారన్నారు. అది సరేనని, అయితే తాను పార్టీకి ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పనుల గురించి చెప్పడం అంత అవసరం కాదన్నారు. రాబోయే కాలంలో చేయబోతున్నదేమిటో అదే చాలా అవసరమని చెప్పారు.

22 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.14,000 కోట్ల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఎనిమిది లక్షల మంది రైతుల విద్యుత్తు బిల్లులు సున్నా అని తెలిపారు. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం క్రింద ప్రజలు రూ.10 లక్షలు బీమా పొందుతున్నారన్నారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

మోదీపై ఘాటు విమర్శలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై రాహుల్ విరుచుకుపడుతూ, తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తామని ఎన్నికల ప్రచార సమయంలో మోదీ వాగ్దానం చేశారన్నారు. ఆ హామీలను నెరవేర్చకపోగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9.500 కోట్లు కేటాయించిందన్నారు.

దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇది దేశానికి కీడు చేస్తుందన్నారు. తాను చేస్తున్న పాదయాత్రలో వివిధ కులాలు, మతాలకు చెందినవారు పాల్గొంటున్నారని చెప్పారు. వారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని చెప్తూ, తన యాత్రను ‘హిందుస్థాన్’ అని అభివర్ణించారు.

అగ్నివీర్ పథకంపై...

రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ (Agniveer) పథకంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు నాలుగేళ్ళు ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటకు తోసేస్తారన్నారు. వారు నాలుగేళ్ళు మాత్రమే పని చేస్తారు కాబట్టి మాజీ సైనికులకు లభించే గౌరవం వారికి లభించదని చెప్పారు.

కోట్లాదిమంది యువత, రైతులు కన్న కలలు కల్లలవుతున్నాయన్నారు. విద్వేషపూరిత వాతావరణం వృద్ధి చెందుతోందన్నారు.

Updated Date - 2022-12-13T16:21:53+05:30 IST