Global leaders : ప్రపంచ నేతల్లో మొనగాడు మోదీ

ABN , First Publish Date - 2022-11-25T13:52:39+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్థాయి అంతర్జాతీయంగా మరింత బలపడింది. అగ్ర దేశాధినేతలను

Global leaders : ప్రపంచ నేతల్లో మొనగాడు మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్థాయి అంతర్జాతీయంగా మరింత బలపడింది. అగ్ర దేశాధినేతలను తలదన్ని ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. ఆయన తర్వాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నిలిచారు. అప్రూవల్ రేటింగ్‌లో మోదీకి మిగిలిన ఇద్దరూ చాలా దూరంలో ఉన్నారు.

మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ (Morning Consult Political Intelligence) సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించిందని బీజేపీ ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలోనూ, గత ఏడాది నవంబరులోనూ విడుదలైన నివేదికలలో కూడా మోదీ అత్యంత ప్రజాదరణగల ప్రపంచ నేతల్లో అగ్రస్థానంలోనే ఉన్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో 75 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు.

ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, జర్మనీ, భారత దేశం, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, అమెరికాలలోని ప్రభుత్వ నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ట్రాక్ చేస్తుంది. అంతర్జాతీయంగా రోజుకు సుమారు 20,000 ఇంటర్వ్యూలు చేస్తుంది. రాజకీయ ఎన్నికలు, ఎన్నికైన ప్రతినిధులు, ఓటింగ్ సమస్యలపై రియల్ టైమ్ పోలింగ్ డేటాను అందుబాటులో ఉంచుతుంది. +/- 1 నుంచి 4 శాతం ఎర్రర్ మార్జిన్‌తో ఫలితాలను వెల్లడిస్తుంది. ఓ దేశంలోని వయోజనుల ఏడు రోజుల మూవింగ్ యావరేజ్ ఆధారంగా ఈ డేటాను విశ్లేషిస్తుంది. అమెరికాలో శాంపిల్ సైజ్ దాదాపు 45,000; ఇతర దేశాల్లో 500 నుంచి 5,000 వరకు ఉంటుంది. అన్ని ఇంటర్వ్యూలను ఆన్‌లైన్‌లోనే చేస్తుంది. మన దేశంలో అక్షరాస్యులైన వయోజనులను ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో అత్యంత ప్రజాదరణగల ప్రపంచ నేతల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ప్రధాన ప్రపంచ నేతలందరి కన్నా ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్నారు. 56 శాతం అప్రూవల్ రేటింగ్‌తో రెండో స్థానంలో ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్ ఉన్నారు. మూడో స్థానంలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 41 శాతం అప్రూవల్ రేటింగ్‌ లభించింది.

నాలుగో స్థానంలో ఉన్న కెనడా పీఎం జస్టిన్ ట్రుడుకు 38 శాతం రేటింగ్‌ లభించగా, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ 36 శాతం రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడ 23 శాతంతో ఆరో స్థానం దక్కించుకున్నారు. మొత్తం 22 మంది నేతలకు లభించిన అప్రూవల్ రేటింగ్స్ ఈ నివేదికలో ఉన్నాయి.

Updated Date - 2022-11-25T13:52:44+05:30 IST