Karnataka Maharashtra border row: పార్లమెంట్‌కు చేరిన సరిహద్దు వివాదం
ABN , First Publish Date - 2022-12-07T19:21:04+05:30 IST
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాద ప్రకంపనలు పార్లమెంట్‌ను తాకాయి.
న్యూఢిల్లీ: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాద ప్రకంపనలు పార్లమెంట్‌ను తాకాయి. మహారాష్ట్రను కర్ణాటకలోని బొమ్మై సర్కారు ముక్కలు చేయాలనుకుంటోందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే లోక్‌సభలో ఆరోపించారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా బొమ్మై ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. మరాఠా ప్రజలపై కర్ణాటకలో దాడులు జరుగుతున్నాయని కూడా ఆమె చెప్పారు.
మరోవైపు 50 ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి తెరదించేందుకు కేంద్రం బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం డిమాండ్ చేసింది. బెళగావిలో ఉండే మరాఠీ ప్రజలకు మద్దతుగా ఎన్సీపీతో కలిసి పోరాడతామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. పరిస్థితులు సద్దుమణగకపోతే ఎన్సీపీతో కలిసి తాము కూడా బెళగావికి ప్రతినిధి బృందాన్ని పంపుతామన్నారు. రెండు రాష్ర్టాల మధ్య సరిహద్దు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్ర సహనానికి ఒక పరిమితి ఉంటుందని, 24 గంటల్లోగా వాహనాలపై దాడులు ఆగకుంటే జరిగే పరిణామాలకు కర్ణాటక ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పవార్ తేల్చిచెప్పారు.
ఇటు సరిహద్దు వివాదం విధ్వంసం రూపు తీసుకుంది. రెండు రాష్ర్టాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర లారీలపై కర్ణాటకలో రాళ్ల దాడి జరుగడంతో వందలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో ఆందోళనకారులు నలుపు, ఆరెంజ్ రంగులు స్ర్పే చేశారు. గ్రాఫిటీ ఆర్ట్ ద్వారా జై మహారాష్ట్ర నినాదాలను కూడా కర్ణాటక బస్సులపై రాశారు. ఈ నేపథ్యంలో మంత్రుల నేతృత్వంలోని మహారాష్ట్ర హైపవర్ కమిటీ చేపట్టదలచిన బెళగావి పర్యటన వాయిదా పడింది. సరిహద్దులో అశాంతిని సృష్టించేందుకు వస్తున్న మహారాష్ట్ర మంత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని అంతకుముందు కరవే అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ ప్రకటించారు. దారవాడ తదితర ప్రాంతాల నుంచి వందలాది వాహనాలలో కరవే కార్యకర్తలు బెళగావికి చేరుకున్నారు.
మరోవైపు పుణేలో కర్ణాటక ఆర్టీసీ బస్సులపై శివసేన కార్యకర్తలు నలుపు, ఆరెంజ్ రంగులను స్ర్పే చేశారు. బుధవారం నుంచి కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు కరవే పిలుపునిచ్చింది. కాగా, తమ గ్రామాల్లో కనీస వసతులు కల్పిస్తారా? లేక తమ గ్రామాలను కర్ణాటకలో కలిపేసేందుకు అనుమతిస్తారా? అని మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా అక్కల్‌కోట్ తహసిల్‌లోని 11 గ్రామాలు అల్టిమేటం జారీ చేశాయి.
ఆందోళనలు హింసాత్మకంగా మారిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ఫోన్ చేసి మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. కారణం లేకుండానే మహారాష్ట్ర బస్సులపై దాడులు జరుగుతున్నాయని చెప్పానన్నారు. వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించానని చెప్పానన్నారు.