Kashi Tamil Sangamam : కాశీ-తమిళ సంగమంతో బీజేపీ బలపడుతోందా?

ABN , First Publish Date - 2022-11-24T17:32:28+05:30 IST

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం కాశీ, తమిళ సంగమం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో తమిళనాడులోని హిందువులు

Kashi Tamil Sangamam : కాశీ-తమిళ సంగమంతో బీజేపీ బలపడుతోందా?
Kashi Tamil Sangamam

న్యూఢిల్లీ : సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం కాశీ, తమిళ సంగమం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో తమిళనాడులోని హిందువులు బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబరు 19 నుంచి నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి అనేకమంది బృందాలుగా హాజరవుతున్నారు. కాశీవిశ్వనాధుని దర్శనం చేసుకుని, గంగా నది తీరంలోని కాశీ ఘాట్లలో విహరిస్తూ, హర హర మహాదేవ అంటూ నినాదాలు చేస్తూ, భక్తిపారవశ్యంలో తేలియాడుతున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉండటం విశేషం. వీరిలో కొందరు ప్రయాగ్‌రాజ్‌ వెళ్ళి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి, శ్రీ ఆది శంకర విమాన మండపం దేవాలయాన్ని కూడా సందర్శించి, పూజలు చేస్తున్నారు.

గంగ, యమున, సరస్వతి (పైకి కనిపించదు) నదుల సంగమ ప్రాంతాన్ని త్రివేణీ సంగమం అంటారన్న సంగతి తెలిసిందే. కాశీ-తమిళ సంగమం కార్యక్రమానికి తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,500 మంది హాజరవుతారని అంచనా. విద్యార్థి, ఉపాధ్యాయ, సాంస్కృతిక, వారసత్వ, ఆధ్యాత్మిక, వ్యాపార, తదితర రంగాలకు చెందిన మొత్తం 12 వర్గాలవారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. వీరంతా వేర్వేరు బృందాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి, పూజలు చేస్తారు.

అయితే కాశీ-తమిళ సంగమంపై తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగంగా స్పందించడం లేదు. కొందరు వ్యక్తులు, సీపీఎం మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, వారణాసిలో జరిగే కాశీ-తమిళ సంగమం కార్యక్రమానికి సహకరించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, అయితే ఆ ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ, మనం గత తరాలకు చెందిన హీరోలను, రాజులను, సాధువులను మర్చిపోతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి వారిని విశ్లేషించకూడదని, అంచనా వేయకూడదని అన్నారు.

ఆరెస్సెస్ యత్నాలు

సీపీఎం విడుదల చేసిన ప్రకటనలో, ఈ కార్యక్రమాన్ని తమిళ సంస్కృతిని దేశంలోని ఇతర ప్రాంతాల్లో చాటి చెప్పడం కోసం ఏర్పాటు చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ చెప్తోందని, అయితే దీని కోసం ఎంపిక చేసినవారిని పరిశీలించినపుడు విద్యా రంగంతో సహా వివిధ రంగాల్లో చొచ్చుకెళ్ళడం కోసం చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోందని ఆరోపించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఆరెస్సెస్ అనేక మార్గాల్లో ప్రయత్నిస్తోందని తెలిపింది.

ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమని నిర్వాహక కమిటీ చెప్పడాన్ని తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంగీకరించడం లేదు. కాశీ, తమిళనాడు మధ్య సాంస్కృతిక అనుబంధం లేదని చెప్తోంది. హిందుత్వంలో తాము సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకోవడం కోసమే దీనిని నిర్వహిస్తున్నారని ఆరోపించింది.

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మౌనంగా ఉండటానికి కారణం ఏమిటంటే, హిందువుల మనోభావాలకు సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోందనే విషయాన్ని గ్రహించడమేనని విశ్లేషకులు చెప్తున్నారు. కాశీ యాత్ర చేయడం తమిళ హిందువుల ఆధ్యాత్మిక లక్ష్యమనే విషయాన్ని ప్రధాన పార్టీలు గుర్తించాయని చెప్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాశీవిశ్వనాథుడిని, తమిళనాడు, రామేశ్వరంలోని రామేశ్వరుడిని దర్శించుకుంటే పాపాలన్నీ నశిస్తాయని, విముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.

అంతా శివమయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కాశీలో బాబా విశ్వనాథుడు, తమిళనాడులో రామేశ్వరుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారని; కాశీ, తమిళనాడు శివమయం అని తెలిపారు.

ఆత్మావలోకనం అవసరం

తమిళనాడులోని సంఘ సంస్కర్త పెరియార్, తమిళ జాతీయవాద కవి భారతీయార్ కూడా కాశీలో పుణ్యస్నానాలు ఆచరించినవారే. పెరియార్ బాల్యంలోనే కాశీ వెళ్ళారు. భారతీయార్ జీవిత చరమాంకంలో కాశీ వెళ్లారు. పెరియార్ కాశీ యాత్ర గురించి రాహుల్ ఈశ్వర్ అనే రైట్ వింగ్ ప్రతినిధి 2020లో రాసిన వ్యాసంలో , 1904లో పెరియార్ కాశీ వెళ్ళినపుడు ఆయనకు ఎదురైన అనుభవాలను వివరించారు. బ్రాహ్మణులు ఆయన పట్ల వివక్ష ప్రదర్శించారని చెప్పారు. ఆయన హిందూ వ్యతిరేకి అవడానికి అదే కారణమని చెప్పారు. ఆత్మావలోకనం చేసుకుని, సంస్కరించుకుంటే భవిష్యత్తులో హిందూ వ్యతిరేకులు పుట్టడాన్ని నిరోధించవచ్చునని చెప్పారు.

కాశీ హిందూ సంగమం

జస్టిస్ కే చంద్రు మాట్లాడుతూ, ఇది కాశీ హిందూ సంగమమని, కాశీ తమిళ సంగమం కాదని అన్నారు. కాశీలో తమిళాన్ని ఉపయోగించడం గురించి ఏమీ లేదన్నారు. అయితే తమిళనాడులో కాశీపట్ల ఉన్న ఆకర్షణను ధ్రువీకరించారు. వేడినిచ్చే దుస్తులు లేకుండా కాశీలో ఉండటం ఎంత కష్టమో పెరియార్ తన రచనల్లో రాశారన్నారు. శీతల వాతావరణాన్ని తట్టుకోవడం తనకు కష్టమైందని, అప్పుడు తాను ఓ వరండాలోకి వెళ్ళానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనకు ఓ కాషాయ శాలువాను కప్పారని చెప్పారన్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చేవారు తన పాదాలకు నమస్కరించడం ప్రారంభించారని చెప్పారన్నారు. వారు తనను దేవుడిలా చూడటం మొదలుపెట్టారన్నారు. హిందూ విశ్వాసాల్లో ఉన్న కొన్ని మూఢ నమ్మకాల గురించి చెప్పడానికి ఇలాంటి కథలను చెప్పేవారన్నారు.

వ్యాపార సంబంధాలు

కాశీతో తమిళనాడుకు వాణిజ్య సంబంధాలు ఆరో శతాబ్దం నుంచి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. వారణాసిలో కొందరు తమిళులు కూడా స్థిరపడ్డారు. ముఖ్యంగా నెట్టుకొట్టాయ్ చెట్టియార్ వ్యాపారస్థులు ఇక్కడ ఉన్నారు. వీరు అనేక ధర్మసత్రాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఇక్కడి దేవాలయాల్లో పూజలు చేసే హక్కును కూడా సంపాదించారు. దేవాలయాల గౌరవాలను కూడా పొందే అర్హతను సంపాదించారు. వారి సంఖ్యాబలానికి అతీతంగా ఇక్కడ వారికి గట్టి పట్టు ఉంది. వారణాసిలో సుమారు 250 తమిళ కుటుంబాలు ఉన్నాయని అంచనా.

బీజేపీలో ఉత్సాహం

ఉత్తరాది, దక్షిణాది విజ్ఞాన, సాంస్కృతిక సంప్రదాయాలను మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని బీజేపీ సంబరపడుతోంది. పరస్పరం తమ వారసత్వాల గురించి అవగాహన కల్పించుకోవడానికి, ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాన్ తమిళ్ ఇమేజ్‌తో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ఇది కలిసివచ్చే అంశమని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు. ఐఐటీ మద్రాస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమానికి నాలెడ్జ్ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.

Updated Date - 2022-11-24T17:32:32+05:30 IST