Nitish Kumar: వ్యూహాత్మకంగా అడుగులేస్తోన్న నితీశ్

ABN , First Publish Date - 2022-12-16T17:19:16+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Nitish Kumar: వ్యూహాత్మకంగా అడుగులేస్తోన్న నితీశ్
Bihar chief minister Nitish Kumar

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాల తరపున శక్తిమంతమైన నేతగా నిలిచేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. బయట నేతలనుంచి మద్దతు పొందడం కంటే ముందు సొంత రాష్ట్రంలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే 2025నాటికి ఎన్నికల సారధ్యం ఉప ముఖ్యమంత్రి తేజస్వీ(Tejashwi Yadav)దే అని చెప్పడం ద్వారా రాజకీయంగా ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకే ఆయన జేడియూ-ఆర్జేడీ క్యాడర్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలూ విలీనమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కూడా రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

నితీశ్ ఓ పక్క ప్రధాని పదవికి లైన్ క్లీయర్ చేసుకుంటుంటే కల్తీ మద్యం ఘటన బీహార్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటంతో నితీశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు బీజేపీ (Bharatiya Janata Party) చేస్తున్న ఆందోళనలతో ఆయన విసిగిపోతున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే తాగి వచ్చారా అని విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. మద్యపాన నిషేధం అమల్లో ఉండగా కల్తీ మద్యం ఎందుకు తాగాలి? ఎందుకు చావాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాగితే చచ్చిపోతారని నితీశ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాదు కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వబోనని ఆయన స్పష్టం చేశారు. పైగా కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్యను కావాలనే అధికంగా చూపుతున్నారని నితీశ్ సెటైర్లు వేస్తున్నారు. గుజరాత్ మోర్బీ ఘటన సమయంలోనూ ఇలాగే వ్యవహరించారా అని నితీశ్ రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువగా చూపడానికి పోస్ట్‌మార్టం చేయకుండానే కల్తీ మద్యం మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షాల నుంచి ప్రస్తుతం నిరసనలు ఎదురౌతుండగా బీహార్‌లో గతంలో మాదిరిగా మరోసారి యాత్ర (Samaj Sudhar Yatra) చేయాలని ఆయన యోచిస్తున్నారు. తద్వారా బీహార్ ప్రజల నుంచి ఆశీస్సులు పొందాలని ఆయన యోచిస్తున్నారు. ఎక్కువ ఓట్లు, సీట్లు సాధించి తిరుగులేని నేతగా నిలవాలని చూస్తున్నారు. ప్రధాని పదవికి తాను రేసులో లేనంటూనే 2024లో బీజేపీ ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసిన నితీశ్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఏ మేరకు సఫలమౌతాయో చూడాలి.

Updated Date - 2022-12-16T17:20:36+05:30 IST