North Korea Vs America : భయం గుప్పెట్లో మొరిగే కుక్క : కిమ్ సోదరి యో జోంగ్

ABN , First Publish Date - 2022-11-22T17:47:24+05:30 IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి యో జోంగ్ (Yo Jong) అమెరికాపైనా, ఐక్యరాజ్య సమితి

North Korea Vs America : భయం గుప్పెట్లో మొరిగే కుక్క : కిమ్ సోదరి యో జోంగ్
Joe Biden, Yo Jong

న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి యో జోంగ్ (Yo Jong) అమెరికాపైనా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపైనా విరుచుకుపడ్డారు. అమెరికాను మొరిగే కుక్కతో పోల్చారు. దక్షిణ కొరియా చాలా ప్రమాదకరమైన సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC) కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్లు అప్పగించి చూస్తోందని దుయ్యబట్టారు.

కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తర్వాత శక్తిమంతురాలైన నాయకురాలు యో జోంగ్. ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, యో జోంగ్ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి, అమెరికాలపై విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా ఓ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను శుక్రవారం పరీక్షించిన నేపథ్యంలో యూఎన్ఎస్‌సీ సమావేశాన్ని సోమవారం నిర్వహించడంపై మండిపడ్డారు. అమెరికా దురాశతో ఆయుధాల పోటీ నిర్వహిస్తోందని మండిపడ్డారు. ఇది కచ్చితంగా ద్వంద్వ ప్రమాణాలను పాటించడమేనని దుయ్యబట్టారు. ఉత్తర కొరియా పరీక్షించినవాటిలో ఇది అత్యంత శక్తిమంతమైన మిసైల్.

యో జోంగ్ అమెరికాను మొరిగే కుక్కతో పోల్చారు. మొరిగే కుక్క భయం గుప్పెట్లో ఉందన్నారు. అమెరికా కొరియా ద్వీపకల్పాన్ని కొత్త సంక్షోభంలోకి నెడుతోందన్నారు. దీనికి ప్రతి చర్య కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర కొరియా శుక్రవారం పరీక్షించిన మిసైల్‌ను హ్వాసోంగ్-17 అని పిలుస్తున్నారు. దీనిని విశ్లేషకులు మాన్‌స్టర్ మిసైల్ అంటున్నారు. ఇది 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

Updated Date - 2022-11-22T17:47:29+05:30 IST