Imran Khan: బుల్లెట్ తొలగించారు కానీ..కాలి ఎముక దెబ్బతింది

ABN , First Publish Date - 2022-11-04T15:20:36+05:30 IST

ఇస్లామాబాద్: కాల్పుల్లో గాయపడ్డ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. లాహోర్‌లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స ...

Imran Khan: బుల్లెట్ తొలగించారు కానీ..కాలి ఎముక దెబ్బతింది

ఇస్లామాబాద్: కాల్పుల్లో గాయపడ్డ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Kha) ఆరోగ్య పరిస్థితి నిలకడగా (Stable) ఉంది. లాహోర్‌లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన్ కాలికి పలు బుల్లెట్లు తగిలాయని, డాక్టర్ ఫైజల్ సుల్తాన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల వైద్య బృందం ఆయనకు వైద్య చికిత్స అందిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ కాలి నుంచి బుల్లెట్లు తొలగించారని వైద్యులు ధ్రువీకరించారు. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. బ్లడ్ ప్రషర్ కూడా చక్కగా ఉన్నట్టు తెలిపారు. కాగా, ఇమ్రాన్ కాలి నుంచి బుల్లెట్ తొలగించినా, బుల్లెట్ కారణంగా ఆయన కాలి ఎముకల్లో ఒకటి దెబ్బతిందని తెలుస్తోంది.

సత్వర ఎన్నికలకు డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ వజీరాబాద్‌లో ర్యాలీ జరుపుతుండగా ఇద్దరు సాయుధలు ఆయనపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. మరణాలు కూడా చోటుచేసుకున్నట్టు అనధికార వార్తలు చెబుతున్నాయి. ఈ వార్తల ప్రకారం, దాడికి పాల్పడిన వారిలో ఒకరిని జనంతో పాటు ఇమ్రాన్ ఖాన్ బాడీగార్డులు పట్టుకుని, కొట్టి చంపారు. మరో వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇమ్రాన్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన కాలిలో పలు బుల్లెట్లు దిగాయి. వెంటనే లాహోర్‌లోని షౌకత్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే సర్జరీ జరిగింది.

కాగా, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఆయనపై కాల్పులు జరిపినప్పటి నుంచి ఆందోళన చెందుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడం వారికి ప్రస్తుతం ఊరట కలిగిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఇమ్రాన్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి చుట్టూ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Updated Date - 2022-11-04T15:24:46+05:30 IST